సెల్ఫీలంటే మరీ అంత పిచ్చా!
లండన్: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్థమాన దేశాల యువతీ యువకుల్లో సెల్ఫీలు తీసుకోవడం పట్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. లండన్ యువతుల్లో మాత్రం ఈ మోజు మరీ పిచ్చి స్థాయికి చేరుకొంది. సెల్ఫీల్లో ముఖాలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ముఖ చర్మం కింద దారపు పోగుల్లా ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకుంటున్నారు.
40 ఏళ్ల లోపుండే యువతులు ఎక్కువగా శస్త్ర చికిత్సలను ఆశ్రయిస్తున్నారని, సాధారణంగా మేకప్ చేసుకొంటే ఈ సిరలు బయటకు కనిపించవని, మేకప్ లేకుండా సెల్ఫీలు దిగడం ఓ మోజుగా మారిందని, అందుకే వారు శస్త్ర చికిత్సలకు ముందుకొస్తున్నారని లండన్ వైద్యులు తెలిపారు. లండన్‌లో గత ఆరునెలల కాలంలోనే 40 ఏళ్లలోపు యువతుల్లో 15 శాతం మంది తమ ముఖాల చర్మం కింద ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకున్నారని వారు చెప్పారు.
సూపర్ స్టార్స్ జెన్నీఫర్ లోపెజ్, జెన్నీఫర్ అనిస్టన్, రిహన్నా, గ్వినెథ్ పాల్త్రో, రోజీ హంటింగ్టన్‌లాంటి వారు మేకప్ లేకుండా సెల్ఫీలు దిగుతూ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నారని, దేన్నో చూసి ఏదో వాత పెట్టుకున్నట్టు వారి బాటలోనే లండన్ యువతరం పయనిస్తోంది. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవా? అని డాక్టర్లను మీడియా ప్రతినిధులు అడిగితే ‘ఎవరి పిచ్చి వారికానందం’ అంటూ అసలు విషయాన్ని దాట వేస్తున్నారు.
హైరెసల్యూషన్ కలిగిన హెచ్‌డీ కెమేరాలు, స్మార్ట్‌ఫోన్ కెమేరాలు అందుబాటులోకి రావడంతో ముఖచర్మం కింద ఉండే సిరలు సెల్ఫీల్లో కనిపిస్తున్నాయని, అందుకే వాటిని తొలగించుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారని డాక్టర్ న్యూమాన్స్ క్లినిక్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ పీటర్ ఫనిగన్ చెప్పారు. అమెరికాలో కూడా ఓ మోజీ ఇటీవల విపరీతంగా పెరిగిపోయిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ వెల్లడించింది. సామాజిక వెబ్‌సట్లలో ఫొటోలు పోస్ట్‌చేసే అమెరికన్ల సంఖ్య 2006లో 79 శాతం ఉండగా, ఇప్పుడది 91 శాతానికి చేరుకుందని ఆ రీసర్చ్ సెంటర్ పేర్కొంది.
వాస్తవానికి లండన్‌లో ఏడాది క్రితం క్యాన్సర్ రీసర్చ్ విరాళాల కోసం సినిమా తారలు సెల్ఫీలు తీసుకొని సామాజిక మీడియాలో వాటిని పోస్ట్ చేయడం మొదలైంది. విరాళాల కోసం మొదలైన ఆ ఉద్యమం ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ జెన్నీఫర్ అనిస్టన్, జెన్నీఫర్ లోపెజ్ లాంటి తారలు ఇప్పటికీ సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. వారికి తందాన అంటూ తాళం వేస్తున్న లండన్ యువతులు తగుదునమ్మా అంటూ సెల్ఫీల మీద సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. ఇక అది ఆదృష్టమో దురదృష్టమో చూసేవాళ్లే తేల్చుకోవాలి!