రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్న విశాల్
విశాల్ రీల్ లైఫ్‌లోని కాదు...రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. ఓ కుటుంబానికి రూ.25వేలు సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. సోషల్ మీడియాలోని వాట్సాప్ ద్వారా ఆ వార్త తెలుసుకుని సాయం అందించాడు. సాయం చిన్నదే అయినా విశాల్ స్పందించిన తీరుతో పాటు, తన పేరు బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేశాడు. వివరాల్లోకి వెళితే.... అనారోగ్యంతో మృతి చెందిన వీడియో జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇదే గ్రూప్‌లో ఉన్న నటుడు విశాల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
కలైంజర్ టీవీ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న వేల్ మురుగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య గర్భిణి. వేల్ మురుగన్ సంపాదనతోనే కుటుంబం గడుస్తోంది. అయితే అతను మరణించినా ఆ సంస్థ పట్టించుకోలేదు. చివరకు జర్నలిస్టు మిత్రులు తమ వాట్సాప్ గ్రూప్‌లో వేల్ మురుగన్ పేదరికాన్ని మిత్రులకు తెలియజేశారు. అలాగే సంస్మరణ సభ, నిధుల సేకరణ నినాదంతో తేదీని వాట్సాప్‌లో ప్రకటించారు.
స్వీట్ హార్ట్ పేరిట ఉన్న ఆ వాట్సాప్ గ్రూప్‌లోని మిత్రులందరూ తలా ఓ చేయి వేశారు. రూ.పది వేల వరకు సేకరించారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో తనకు వచ్చిన సమాచారంతో నటుడు విశాల్ స్పందించాడు. తన మేనేజరు ద్వారా రూ.25 వేలు ఆ కుటుంబానికి సాయంగా పంపించాడు. అయితే తన పేరును ప్రచారం చేయవద్దంటూ విశాల్ విజ్ఞప్తి చేసినా కొందరు మిత్రులు వాట్సాప్‌లో అతనికి కతృజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం విశేషం.