కూపీ లాగుతున్నారు
సాక్షి, సంగారెడ్డి: వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) అక్రమాలపై సహకార శాఖ కమిషనరేట్ నేరుగా విచారణ ప్రారంభించింది. సదరు పీఏసీఎస్ పాలకవర్గం పెద్దలతో సహకార శాఖ జిల్లా అధికారులు కుమ్మక్కై తూతూ మంత్రంగా విచారణ జరిపారని ఫిర్యాదులు అందడంతో కమిషనరేట్ స్వయంగా రంగంలో దిగి విచారణకు ఆదేశించింది. పీఏసీఎస్పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపి 15 రోజుల్లో నివేదించాలని సహకార శాఖ కమిషనర్ సందీప్ సుల్తానియా తన కార్యాలయ అడిషనల్ రిజిస్ట్రార్ కిరణ్మయికి ఆదేశించారు.
ఆమె రెండు రోజుల కిందే జిల్లా సహకార శాఖ నుంచి ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణలో తేలిన అంశాలపై హైదరాబాద్ నుంచే ప్రత్యేక బృందాన్ని పంపించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కమిషనర్ నిర్ణయించినట్లు సమాచారం.
పీఏసీఎస్ పాలకవర్గం కమీషన్ల కోసం కక్కుర్తి పడి బలవంతంగా ప్రైవేటు బీమా చేయించి ఆ తర్వాత రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే విధంగా రుణ మాఫీ పథకం కింద రుణాలు మాఫీ చేసినా..రైతుల వాటా ధనం తిరిగి చెల్లించలేదు. పలు ఆరోపణలతో ఫిర్యాదులు వస్తే జిల్లా సహకార శాఖ తూతూ మంత్రంగా పరిశీలన జరిపి అక్రమాలేవీ జరగలేదని తేల్చిన అంశంపై బుధవారం ‘సాక్షి’లో ‘పరి‘ఛీ’లన’ శీర్షికతో ప్రత్యేక కథనం వచ్చింది.
ఈ కథనంపై సైతం కమిషనరేట్ కార్యాలయం స్పందించి జిల్లా అధికారులకు వివరణ కోరినట్లు సమాచారం. కమిషనరేట్ విచారణ సహకార శాఖ జిల్లా అధికారులకు గుబులు పుట్టిస్తోంది. సొసైటీలో అక్రమాలకు ఇంత కాలం వంత పాడినందుకు తమపై కూడా చర్యలు తప్పవని కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓ అధికారి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని ఆశ్రయించి రక్షించాలని కోరినట్లు చర్చ జరుగుతోంది.