ఏసీబీకి చిక్కిన వీటీడీఏ సీపీవో
వేములవాడ/సుల్తాన్‌బజార్: వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ) చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్‌గౌడ్ సోమవారం ఏసీబీకి చిక్కారు. లే అవుట్ అనుమతి కోసం రూ.6.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆయన్ను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న జవ్వాజి సంపత్, వినికంటి సందీప్‌లు త్రిశూల్ డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల వేములవాడ రుద్రవరంలో కొనుగోలు చేసిన ఓ స్థలం లే అవుట్ కోసం వీటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్‌గౌడ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.6.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.
అనంతరం సంపత్, సందీప్‌లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీరభద్ర, ఇన్స్పెక్టర్ సంజీవ్‌లను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఫోన్ ద్వారా లక్ష్మణ్‌గౌడ్‌తో మాట్లాడి డబ్బులు సిద్ధం చేశామని, ఎక్కడ ఇవ్వాలని అడగగా.. హైదరాబాద్ కోఠి గుజరాతిగల్లీలోని తన నివాసం వద్దకు రావాలని సూచించారు. వారు వచ్చాక తన కుమారుడు రోహిత్‌ను పంపిస్తున్నానని, అతనికి నగదు ఇవ్వాలని లక్ష్మణ్‌గౌడ్ చెప్పాడు. నగదును తీసుకుని బ్యాగ్‌లో పెట్టుకున్న రోహిత్‌ను అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మణ్‌గౌడ్ నుంచి వాగ్మూలం తీసుకుని అతనితో పాటు కుమారుడు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.