టేస్ట్ స్పెషలిస్ట్
ఎంతటి నలభీములు వండిన పాకమైనా.. ముందు ఆయన టేస్ట్ చేయాల్సిందే.. ఆ నాలుక మెచ్చి.. ఆహా ఏమి రుచి అంటేనే.. దానికి ఆమోదముద్ర పడుతుంది. స్టార్ హోటళ్లు సైతం ఆయన ఓకే అంటే గానీ కొత్త వంటలను మెనూలో చేర్చుకోవు. రుచి చూడటమే ఆయన అభి‘రుచి’. ఇప్పుడదే ఆయన వృత్తి. నగరంలోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు ఆయున విశిష్ట అతిథి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఏం చేయకపోయినా.. ఈ టేస్ట్ స్పెషలిస్ట్ బడా చెఫ్లకే రుచుల పాఠాలు చెబుతున్నారు. రుచుల వేటలో ఐటీ ఉద్యోగాన్ని కూరలో కరివేపాకులా తీసిపారే సిన.. టేస్ట్ స్పెషలిస్ట్ సంకల్ప్ సిటీప్లస్‌తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
చిన్నప్పటి నుంచి తినడం అలవాటు
చిన్నప్పటి నుంచి తినడం అలవాటుగా ఉండేది. స్కూల్లో చదివే రోజుల్లో ఈఎస్ఐ ఆస్పత్రి, వెంగళరావునగర్ ఏరియాలో నేను వెళ్లని హోటల్ లేదు. ఏ హోటల్‌కు వెళ్లినా.. ఏ రెసిపీని ఎలా తయారు చేస్తారో వంటగదిలోకి వెళ్లి చెఫ్‌లను అడిగి మరీ తెలుసుకునేవాడిని. నాకు నచ్చిన వంటకం గురించి ఇంటర్నెట్లో సమీక్షలు రాయడం ప్రారంభించాక గుర్తింపు మొదలైంది. మన నగరంలో వంటకాలపై పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాలనేది నా అభిమతం.
‘జొమాటో’ తొలి వేదిక
పరపంచవ్యాప్తంగా విభిన్నమైన వంటకాలు, అవి దొరికే రెస్టారెంట్లపై సమాచారం ఇచ్చే వెబ్సైట్ ‘జొమాటో’ నా తొలి వేదిక. బయట తిన్న ప్రతిసారీ ‘జొమాటో’లో విశ్లేషణలు రాసేవాడిని. కొద్దిరోజులకే ఫాలోవర్స పెరిగారు. నగరంలో దాదాపు 500 పైగా హోటళ్లు, రెస్టారెంట్లలో లభించే వంటకాలపై సమీక్షలు రాశాను. దీంతో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు నన్ను టేస్టింగ్ సెషన్సకు పిలుస్తున్నాయి. నా సూచనల మేరకు రెసిపీని మారుస్తారు. హైదరాబాద్‌లోనే కాదు, బెంగళూరు, చెన్నై, పుణే, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ టేస్టీ సెషన్స్‌కు వెళ్లాను. పలు కుకరీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించాను.
త్వరలోనే హోటల్ పెడతా
వండటం తెలుసా అని ప్రశ్నించే వారూ ఉన్నారు. త్వరలోనే ఒక హోటల్ పెడుతున్నా. రకరకాల వంటకాలు రుచి చూస్తున్నా.. దేవుడి దయ వల్ల ఇంతవరకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. రోజూ ఉదయం 8 కిలోమీటర్లు పరిగెత్తుతాను. రాత్రి గ్లాసెడు మజ్జిగ తాగుతాను. ఎన్ని రుచులు చూసినా, ఇంట్లో అమ్మచేతి వంటకు సాటిరావు. అమ్మ వండిన టమాటా పప్పు, వంకాయ కూరకు మించిన రుచి మరొకటి ఉండదు.
తినిపించడంలోనే ఆనందం
తినిపించడంలోనే అసలైన ఆనందం ఉందని నమ్ముతా. హోటళ్లలో మిగిలిపోయిన వంటకాలను అనాథలకు పంచాలనే ఆలోచనను ఆర్గనైజ్డ్గా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటికే కొన్ని హోటళ్లు కూడా ఇందుకు ముందుకొచ్చాయి.