కురుక్షేత్రంలో వెంకన్న ఆలయ నిర్మాణం
సాక్షి, తిరుమల: హర్యానాలోని కురుక్షేత్రం పుణ్యక్షేత్రంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తోంది. వచ్చే వేసవి నాటికి కొత్త ఆలయంలో వెంకన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. హర్యానా ప్రభుత్వం ఆధీనంలోని కురుక్షేత్రం డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి 5 ఎకరాల భూమి విరాళంగా సమర్పించింది. మరో ఐదెకరాలు ఇచ్చేందుకు అంగీకరించిం ది. ఇందులో రూ.32.6 కోట్లతో ఆలయం, అనుబంధ అభివృద్ధి పనులు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది.
తొలి విడతగా రూ.17.6 కోట్ల అంచనాలతో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తోంది. రాజగోపురం, ముఖ మండపం, మహా మణిమండపం, అర్థమండ పం, గర్భాలయం, వైకుంఠ ద్వారం పనులు సాగుతున్నాయి. అలాగే, కురుక్షేత్రంలో శ్రీవారి ఆలయానికి అనుబంధంగా రథమండపం, వాహన మండపం, అన్నదాన భవనం, అధికారులు, సిబ్బంది క్వార్టర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.15 కోట్లు కేటాయించారు. ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.