జీపు-బైక్ ఢీ.. ఇద్దరి మృతి
చోడవరం టౌన్, న్యూస్‌లైన్ : మండలంలోని వెంకన్నపాలెం-నర్సాపురం రోడ్డులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదంలో సంఘటన స్థలం వద్ద ఒకరు మృతిచెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్ను మూశారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం దబ్బిరాజుపేటకు చెందిన కోన గోవిందరావు (38), జొన్నపల్లి నాగరాజు (30)లు అనకాపల్లిలో ఉంటూ అచ్యుతాపురంలో చిన్నచిన్న కూలీ పనులు చేస్తుంటారు.
రోజూ మాదిరిగా బైక్‌పై అచ్యుతాపురం వెళ్తుండగా, చోడవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న జీపు బలంగా ఢీకొంది. దీంతో కోన గోవిందరావు అక్కడికక్కడే మరణించాడు. నాగరాజును 108లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సంఘటన స్థలంలోని చేరుకున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. గోవిందరావుకు భార్య మోనిక, ఒక కుమార్తె, కుమారుడు, నాగరాజుకు భార్య గౌరి, ఒక కుమార్తె ఉన్నట్లు బంధువులు తెలిపారు. దీనిపై చోడవరం ఎస్ఐ ఎ.ఆదినారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.