venkat akkineni
-
అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు దూరమయ్యానంటే: వెంకట్ అక్కినేని
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలను నిర్మాతగా నిర్మించారు. ఆ చిత్రాలన్నీ కూడా అన్నపూర్ణ బ్యానర్‌పై నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసత్వాన్ని విజయవంతంగా నాగార్జున కొనసాగిస్తున్నారు. కానీ ఏఎన్నాఆర్ పెద్దాబ్బాయి అమెరికాలో చదువుకుని ఇండియా తిరిగొచ్చారు. కానీ ఆయన మీడియాకు కొంచెం దూరంగానే ఉంటూ వచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. 'నేను, నాగార్జున ఇద్దరం కూడా మొదట ఇండస్ట్రీ వాతావరణంలో పెరగలేదు. మా ఇద్దరికి సినిమా ప్రపంచం అంతగా తెలియదు.. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. దీంతో అప్పట్లో సినిమాల గురించి మా ఇద్దరికీ ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయలేదు. అలా మా చదువులు పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా ఎంట్రీ గురించి కూడా మొదట నేనే నాన్నగారితో మాట్లాడాను. నాగార్జునను హీరోగా చేద్దాం అని చెప్పాను దానికి ఆయన వెంటనే ఓకే అనేశారు. నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు నేను చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. సినిమా వ్యవహారాలు నాకు అంతగా తెలియవు.. ఆ విషయాలపై నాగార్జునకు మంచి అవగాహన ఉంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఎప్పుడూ మేము టచ్‌లోనే ఉంటాము. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్నీ నాగార్జుననే చూసుకుంటున్నాడు.' అని వెంకట్ చెప్పారు. -
దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు...
- వెంకట్ అక్కినేని నాన్న లేకుండా మేము జరుపుకొంటున్న ఆయన తొలి పుట్టినరోజు ఇది. ఈ క్షణంలో నా మనసు నిండా ఏవేవో భావాలు, ఆలోచనలు. తల్లితండ్రులు పోయినప్పుడు ఎవరికైనా సరే అన్నేళ్ళుగా తమతో ఉన్న లైఫ్‌లైన్ కట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నా పరిస్థితీ అదే. పైగా నాన్న కుటుంబానికి చాలా ప్రాధాన్యమిచ్చే మనిషి. అంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో మా కుటుంబ సభ్యులందరి మధ్య చాలా సాన్నిహిత్యం. అందుకే, నాన్న లేరన్న వాస్తవాన్ని ఇవాళ్టికీ జీర్ణించు కోలేకపోతున్నాం. కాలమే ఈ గాయాన్ని మాన్పుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు వెళ్ళిపోయేవాళ్ళమే. ఆయన అన్ని రకాలుగా సంపూర్ణ జీవితం అనుభవించిన మనిషి. దర్జాగా బతికారు, హుందాగా వెళ్లి పోయారు. అందుకే, ఆయన జీవించిన విధానాన్ని ప్రశంసించాలి. అమ్మ చాలా ఏళ్లు అనారోగ్యంతో బాధపడడం కళ్లారా చూశాం. పాపం... ఇంట్లో ఆమె వెంటే ఉంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ నాన్న ఎంత వేదన అనుభవించారో మాకు తెలుసు. కానీ, క్యాన్సరొచ్చినా, పెద్దగా బాధపడకుండానే ఆయన అనాయాసంగా కన్ను మూశారు. నిజానికి, క్యాన్సర్ ఉన్నట్లు అడ్వాన్స దశలో కానీ బయటపడలేదు. గత సెప్టెంబర్‌లో నాన్న పుట్టినరోజు ఆనందంగా జరుపుకొన్నాం. ఆ తరువాత కొద్ది వారాలకే వ్యాధి సంగతి బయటపడింది. క్యాన్సర్ వచ్చిన సంగతి నాన్నకు చెప్పడానికి డాక్టర్లు సంకోచిస్తుంటే, నేనే ఆయనకు ముందుగా విషయం చెప్పాను. (కన్నీళ్ళను ఆపుకొంటూ...) ఒక దుర్వార్త వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారన్న దాన్నిబట్టి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించవచ్చు. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది దాచేస్తుంటారు. విషయం బయటకు లీకై నలుగురూ లేనిపోనివి అనుకొనే బదులు, పబ్లిక్ ఫిగరైన మీరే విషయం చెప్పి, అలాంటి ఇతర క్యాన్సర్ బాధితులకు కూడా డీలా పడిపోకుండా పాజిటివ్ దృక్పథంతో ఉండమని చెప్పవచ్చు కదా అని నేను సూచించాను. అంతే. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి, తన వ్యాధి సంగతి ధైర్యంగా ప్రకటించారు. ఆశీస్సులతో బతుకుతానన్నారు. అంతెందుకు! మా బంధువుల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చి భయపడుతుంటే, తాను క్యాన్సర్ బాధలో ఉన్నా, వాళ్ళను పిలిచి, 2 గంటలు మాట్లాడి ధైర్యం చెప్పారు. కోలన్ క్యాన్సర్‌లో కూడా చాలా క్లిష్టమైన, అరుదైన చోట నాన్నకు వ్యాధి వచ్చింది. అత్యాధునిక కెమోథెరపీ మందు కూడా పని చేయలేదు. చివరి రోజులని తెలిసినా ఆయన ధైర్యం కోల్పోలేదు. మంచి చికిత్సతో ఆయన మరో 2 -3 నెలలు బతుకుతారనుకున్నాం. మనసులోనే బాధ దిగమింగుకొని ఆయన ఎదుట జోక్స్ వేసి, నవ్విస్తూ, మాలో ఎవరో ఒకరం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండేవారం. ఒకరోజు సాయంత్రం కొద్దిగా నొప్పి మొదలై, మేము ‘ప్యాలియేటివ్ కేర్’కు ఏర్పాట్లు చేశాం. నిద్ర మత్తుతోనే ఏదో ఆయన మాట్లాడారు. కానీ, ఆ అర్ధరాత్రి దాటాక ప్రశాంతంగా శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, (గొంతు జీరపోగా...) అమ్మానాన్నలకు మనమేదైనా లోపం చేశామా, మరింత హ్యాపీగా ఉంచలేకపోయామా, కొన్నిసార్లు అనవసరంగా కోపతాపాలు చూపామా అన్న ఆలోచనలు పిల్లలకు వస్తూ ఉంటాయి. ఎవరికైనా అది సహజం. పిల్లలకు 14 -15 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి తాను తీసుకొనే నిర్ణయాల్లో వారినీ భాగస్వామిని చేయడం నాన్న పెంపకంలోని ప్రత్యేకత. అలా మాలో ఆలోచించే తత్త్వాన్ని పెంచేవారు. పెద్దవాళ్లతో ఆయన చర్చిస్తున్నప్పుడు చిన్నతనంలో నేను ఆసక్తిగా వింటూ ఉంటే, ఆయన ప్రోత్సహించారు. ఆయనకు ఇంట్లో అందరూ సమానమే అయినా, ఇంటికి పెద్దవాణ్ణి కావడం వల్లనేమో నేనంటే పిసరంత అభిమానం ఎక్కువే అనిపిస్తుంటుంది. అమెరికాలో చదువుకొని 1977లో తిరిగొచ్చాక, అనుకోకుండా 1978లో అన్నపూర్ణా స్టూడియో నిర్వహణ చేపట్టా. నష్టాలతో స్టూడియో పక్షాన చిత్ర నిర్మాణం కొన్నాళ్ళు ఆగింది. ఆ తరువాత అనుకోకుండా నేనే చిత్ర నిర్మాణం చేపట్టా. జీవితంలో పిల్లల్ని ఎవరినీ, దేనికీ వద్దని చెప్పని నాన్న ‘పెదబాబూ... నువ్వు ముక్కుసూటి మనిషివి. నీకు సినీ రంగం సరిపడదేమో’ అని మాత్రం అన్నారు. ‘ఒక్కసారి ట్రై చేస్తా’ అన్నప్పుడు మారుమాట్లాడకుండా సరే అన్నారు. అప్పుడు వేరే యాక్టర్ల కోసం ప్రయత్నించి, చివరకు ఇంట్లోనే నాగార్జున ఉన్నాడు కదా అని వాడు నటిస్తాడని నాన్నకు చెప్పి, ‘విక్రవ్‌ు’ (’86)తో నిర్మాతనయ్యా. అయితే, పది - పన్నెండు సినిమాలు తీసి, పాతికేళ్ళు స్టూడియో చూసుకున్నాక 2002 ప్రాంతంలో ఆ బాధ్యత నాగార్జునకు అప్పగించా. నాన్న నన్నే చూడమన్నా, వద్దన్నా. ఇప్పుడు రసాయన, వైద్య పరికరాల దిగుమతుల పరిశ్రమలతో బిజీగా ఉన్నా. మంచి కథ దొరికితే, మళ్ళీ సినిమా తీయాలనుంది. మా అబ్బాయి ఆదిత్యనూ హీరోని చేయాలని నాన్నకుండేది. కానీ, వాడికి ఆసక్తి లేకపోవడంతో మేము బల వంతం చేయలేదు. ఆయన అవార్డును ఏటా ఇవ్వడం, జన్మభూమి ట్రస్ట్ కింద కార్యక్రమం చేయడం లాంటి నాన్న ఆఖరి కోరికలు నెరవేరుస్తాం. అనుక్షణం నాకండగా ఉన్న నాన్నను చిరస్మరణీయం చేసు కొనేది అలాగే! సంభాషణ: రెంటాల జయదేవ -
రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది
అక్కినేని నాగార్జున... పరిచయం అవసరం లేని పేరు. వెంకట్ అక్కినేని... బయట పెద్దగా వినిపించని పేరు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరే. ఒకరు తెరమీద, మరొకరు తెర వెనుక. కలల దారిలో ఇద్దరూ ఒకటిగా అడుగులు వేశారు. ఈ సృజనాత్మక ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, అద్భుతాలు... ఐతే ఒకరు ఫోకస్లో ఉండి మరొకరు ఔట్ ఫోకస్లో ఎందుకు ఉండిపోయారు? ఇద్దరూ ఏ విషయాల్లో ఏకీభవిస్తారు, ఎక్కడ విభేదిస్తారు? ఇద్దరూ కలిసి నడిచిన కాలాలు, తడియారని జ్ఞాపకాల గురించి వెంకట్ అక్కినేని అంతరంగం... ఈ పాతికేళ్లలో నాగార్జున లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారాడు. అన్నమయ్య నుంచి దేవుని మీద భక్తి పెరిగిందనుకుంటా. ఇక తను అప్పుడూ ఇప్పుడూ హార్డ్ వర్కింగ్. ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదు. బాల్యంలో మీ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? నాన్నగారు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. కానీ మేం సినిమా ఆలోచన లేకుండా పెరిగాం. నేను, నాగ సుశీల దగ్గరి వయసువాళ్లం కాబట్టి ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాగ్‌కు, నాకు ఐదేళ్లు తేడా. కాబట్టి మొదటి నుంచీ తన సర్కిల్ వేరు. నా సర్కిల్ వేరు. అయితే తనకు అమ్మమ్మతో చనువు ఎక్కువ. చదువుల రీత్యా కూడా వేరువేరుగా ఉండాల్సి రావడంతో మేం కలిసి పెరిగింది చాలా తక్కువ. 1975లో ఎం.బి.ఎ. కోసం యూఎస్ వెళ్లాను. నాగ్ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు. నేను యూఎస్ నుంచి వచ్చేసరికి చాలా హైట్ పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నేను వచ్చాక తను యూఎస్ వెళ్లిపోయాడు. సినిమాల్లోకి రావాలనేది మీ కలా? కేవలం యాదృచ్ఛికమా? మాది సినిమా కుటుంబమే అయినా మేం సినిమా ప్రపంచానికి దూరంగా, బాగా చదవాలని నాన్నగారు భావించేవారు. అంతకుముందు మా పేర్లమీద సినిమాలు తీసినా మాకు ప్రమేయం ఉండేది కాదు. కానీ అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. 1975లో నాన్నగారు అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభించారు. నేను 1977లో అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చాను. రాగానే స్టూడియో మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పటికి హైదరాబాద్‌లో ఎవరూ పెద్దగా షూటింగ్ చేసేవాళ్లు కాదు. దాంతో సంవత్సరానికి 25 లక్షలు నష్టం వచ్చేది. అలాంటి సమయంలో మాకు ప్రొడక్షన్ తప్ప వేరే దారి కనిపించలేదు. చాలామంది ఆర్టిస్ట్‌ల చుట్టూ, డెరైక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్లు ఏదో రకంగా తప్పుకునేవారు తప్ప మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది. నాగార్జున యూఎస్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక వేరేవాళ్ల చుట్టూ తిరిగే ఓపిక లేక, నువ్వు హీరోగా చేస్తావా అని నాగార్జునను అడిగాను. యా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పాం. ఆయన కూడా ఓకే అన్నారు. అలా మా సారథ్యంలో విక్రమ్ మొదలైంది. అప్పట్లో అదంతా ఒక కలలా జరిగిపోయింది. మీరెప్పుడైనా హీరో కావాలనుకున్నారా? మొదటినుంచీ యాక్టర్ కావాలని అనుకోలేదు. నాన్నగారు ఆ ఆలోచనతో మమ్మల్నెప్పుడూ పెంచలేదు. చిన్నతనం నుంచీ మా ధాట్ ప్రాసెస్‌లో అది లేకపోవడం వల్ల జరగలేదు. కానీ హీరో అయ్యే క్యాపబిలిటీస్ నాలో ఉన్నట్లు నేను నమ్ముతాను. ఆ ఐడియా ఉంటే కచ్చితంగా హీరో అయ్యేవాణ్నేమో. ఆలోచన వచ్చేప్పటికి నేను హీరో వయసు దాటిపోయాను. తెర వెనుక మీ ఇంట్రస్ట్ ఏమిటి? ఒక దశలో డెరైక్టర్ కావాలనుకుని కొన్ని స్క్రిప్ట్‌ల మీద వర్క్ చేశాను. ఎందుకంటే నేను ప్రతీ దశలోనూ ప్రొడక్షన్‌తో ఇన్వాల్వ్ అయ్యాను. దాంతో నాకు డెరైక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది. నా టేస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలకు దగ్గరగా ఉంటుంది. మన ఆడియన్స్ టేస్ట్, మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం విరమించాను. ఎప్పటికైనా నా టేస్ట్‌కు తగ్గ సినిమా తీయాలనుంది.. అది కాకుండా ఎడిటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా బ్యానర్లో చాలా సినిమాల ఎడిటింగ్‌లో నేను కీ-రోల్ ప్లే చేశాను. ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకుడిగా ఉన్న మీరు మధ్యలో ఎందుకు వెనక్కి వచ్చారు? దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తన వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను. కథలు వినడం, ఏ నిర్మాతతో సినిమా చేయాలి, ఏ డెరైక్టర్‌తో పనిచేయాలి వంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక నాగ్‌కు సొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చింది. తనదైన ఐడియాలజీని రూపొందించుకుని తదనుగుణంగా కెరీర్ ప్లాన్ చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు నా అవసరం తనకు లేదనిపించింది. మరోవైపు ఒక దశలో మూవీ మేకింగ్ చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఆర్గనైజ్డ్ బిజినెస్. అందులోనూ తను కూడా నిర్మాణంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరం చేయడం కరెక్ట్ కాదనిపించింది. నేనిక రిలాక్స్ కావచ్చనిపించింది. ఈ విషయంలో నేను, నాగార్జున ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చాం. సినీ రంగంలో అక్కినేని వంశం అంటే నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ఆ వరుసలో మీ పిల్లలు ఎక్కడా కనిపించరు ఎందుకని? బేసిక్‌గా మా పిల్లలకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు. అబ్బాయి ఆదిత్యకు రేసింగ్ ఇష్టం. నాన్నగారికి ఆదిత్యను హీరో చేయాలని చాలా ఉండేది. తనకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. నేను చాలాసార్లు వాణ్ని అడిగి చూశాను. కానీ తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పాడు. నాకు తను సినిమాల్లోకి హీరోగా వస్తే బాగుండనిపించేది. మన ఆశల కన్నా పిల్లల ఆసక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను.తనకు ఇంట్రస్ట్ ఉన్న రంగం వైపు ప్రోత్సహించాను. ఇప్పుడు అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అమ్మాయి అన్నపూర్ణ ఆర్కిటెక్చర్ చేసి యూఎస్‌లో ఆర్కిటెక్ట్‌గా చేస్తోంది. తన టాలెంట్‌కు బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. పిల్లలు వాళ్లు ఎంచుకున్న రంగంలో పేరు తెచ్చుకున్నారు. నాకదిచాలు. సినిమా నుంచి బయటకు వచ్చాక, ఏ వ్యాపారాలు చేపట్టారు? నాకు వైజాగ్ బేస్డ్గా ఫార్మా కంపెనీ ఉంది. దానికి ఎండీగా ప్రస్తుతం కంపెనీని విస్తరించే పనుల్లో ఉన్నాను. ఇంకా రకరకాల వెంచర్స్ చేస్తుంటాను. అన్నిటికన్నా నాకు ఫార్మింగ్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. చిన్న స్కేల్లో హైడ్రోఫోనిక్స్ ద్వారా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. మీకు, నాగార్జునకు మౌలికమైన తేడాలేమిటి? తనకు ఆరోగ్యం పట్ల, తనకు సంబంధించిన ప్రతి విషయంలోను చాలా జాగ్రత్త. బహుశా నేనంత జాగ్రత్తగా ఉండలేనేమో. అదే తేడా. మరి మీ ఇద్దరి మధ్య సారూప్యత? ఇద్దరికీ చాలా కోపమెక్కువ. అది స్వభావరీత్యా అలవడిందనుకుంటా. ఈ మధ్యే నేను కొంత తగ్గాను. మీ ఇద్దరిలో ఎవరు మంచి బిజినెస్‌మ్యాన్? నిస్సందేహంగా నాగార్జునే. ఇద్దరిలో రిస్క్ చేయడంలో ఎవరు ముందుంటారు? ఆ విషయంలో ఇద్దరమూ ముందుంటాం. రిస్క్ చేసే గుణం ఉంది కాబట్టే ఏమాత్రం అనుభవం లేని రామ్‌గోపాల్‌వర్మను దర్శకుడిగా పెట్టి ‘శివ’ తీశాం. రిస్క్ చేసే ధైర్యం ఉంది కాబట్టే నాగార్జున ‘అన్నమయ్య’ చేయగలిగాడు. నాగార్జునను నటుడిగా మీరు మెచ్చే సినిమాలు? రాజన్న, అన్నమయ్య, రామదాసు. సాయిబాబాలో తన నటన చాలా బాగున్నా, సినిమా సరిగా తీయలేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీ మధ్య ఎలాంటి విషయాల్లో చర్చ జరుగుతుంది? మేం వారానికి రెండుసార్లు అన్నపూర్ణ స్టూడియోలో కలుస్తుంటాం. వీలైతే ఆదివారం నాన్నగారి ఇంట్లో అందరం కలుస్తాం. కలిసినప్పుడు మా ఇద్దరిమధ్యా లైఫ్‌స్టైల్, హెల్త్ విషయాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేం ఆలోచించాల్సింది అవే కాబట్టి. అన్నపూర్ణా స్టూడియోను ఏ రోజుకైనా ఫిలిం ప్రొడక్షన్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆశయం. మీ అనుబంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. అలాగని చాలా దగ్గరగా ఉండే అన్నదమ్ములం కూడా కాదు. అందుకు ఒక కారణం ఏజ్ డిఫరెన్స్. రెండో కారణం... బంధం బలపడే వయసులో ఒక దగ్గర లేకపోవడం. కానీ ఏదైనా అవసరం వస్తే ఒకరి కోసం ఒకరం చాలా గట్టిగా నిలబడతాం. డబ్బు అంత ప్రయారిటీ కాదు కాబట్టే మా మధ్య అనుబంధం అంత బలంగా వుంది. సినిమా, వ్యాపారం... వీటికి దూరంగా మీ హాబీలు? నాకు వైల్డ్ లైఫ్, ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇప్పుడు పరమహంస యోగానంద రాసిన ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ చదువుతున్నాను. - కె.క్రాంతికుమార్‌రెడ్డి