రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది | My relation with Nagarjuna is great, says Venkat akkineni | Sakshi
Sakshi News home page

రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది

Published Sun, Sep 1 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది

రిలేషణం: పైకి కనిపించని అనుబంధం మాది

అక్కినేని నాగార్జున... పరిచయం అవసరం లేని పేరు.
 వెంకట్ అక్కినేని... బయట పెద్దగా వినిపించని పేరు.
 ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఇద్దరే.
 ఒకరు తెరమీద, మరొకరు తెర వెనుక.
 కలల దారిలో ఇద్దరూ ఒకటిగా అడుగులు వేశారు.
 ఈ సృజనాత్మక ప్రయాణంలో  ఎన్నో విజయాలు, అపజయాలు, అద్భుతాలు...
 ఐతే ఒకరు ఫోకస్‌లో ఉండి మరొకరు ఔట్ ఫోకస్‌లో ఎందుకు ఉండిపోయారు?
 ఇద్దరూ ఏ విషయాల్లో ఏకీభవిస్తారు, ఎక్కడ విభేదిస్తారు?
 ఇద్దరూ కలిసి నడిచిన కాలాలు, తడియారని జ్ఞాపకాల గురించి వెంకట్ అక్కినేని అంతరంగం...

 
 ఈ పాతికేళ్లలో నాగార్జున లైఫ్ స్టైల్‌లో చాలా మార్పు వచ్చింది. నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారాడు. అన్నమయ్య నుంచి దేవుని మీద భక్తి పెరిగిందనుకుంటా. ఇక తను అప్పుడూ ఇప్పుడూ హార్డ్ వర్కింగ్. ఆ విషయంలో ఎలాంటి మార్పూ లేదు.
 
     బాల్యంలో మీ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది?
 నాన్నగారు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు. కానీ మేం సినిమా ఆలోచన లేకుండా పెరిగాం. నేను, నాగ సుశీల దగ్గరి వయసువాళ్లం కాబట్టి ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాగ్‌కు, నాకు ఐదేళ్లు తేడా. కాబట్టి మొదటి నుంచీ తన సర్కిల్ వేరు. నా సర్కిల్ వేరు. అయితే తనకు అమ్మమ్మతో చనువు ఎక్కువ. చదువుల రీత్యా కూడా వేరువేరుగా ఉండాల్సి రావడంతో మేం కలిసి పెరిగింది చాలా తక్కువ. 1975లో ఎం.బి.ఎ. కోసం యూఎస్ వెళ్లాను. నాగ్ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడు. నేను యూఎస్ నుంచి వచ్చేసరికి చాలా హైట్ పెరిగి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నేను వచ్చాక తను యూఎస్ వెళ్లిపోయాడు.
 
     సినిమాల్లోకి రావాలనేది మీ కలా? కేవలం యాదృచ్ఛికమా?
 మాది సినిమా కుటుంబమే అయినా మేం సినిమా ప్రపంచానికి దూరంగా, బాగా చదవాలని నాన్నగారు భావించేవారు. అంతకుముందు మా పేర్లమీద సినిమాలు తీసినా మాకు ప్రమేయం ఉండేది కాదు. కానీ అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను. 1975లో నాన్నగారు అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభించారు. నేను 1977లో అబ్రాడ్ నుంచి ఇండియాకు వచ్చాను. రాగానే స్టూడియో మేనేజ్‌మెంట్‌లో ఇన్‌వాల్వ్ అవ్వాల్సి వచ్చింది.
 
 అప్పటికి హైదరాబాద్‌లో ఎవరూ పెద్దగా షూటింగ్ చేసేవాళ్లు కాదు. దాంతో సంవత్సరానికి 25 లక్షలు నష్టం వచ్చేది. అలాంటి సమయంలో మాకు ప్రొడక్షన్ తప్ప వేరే దారి కనిపించలేదు. చాలామంది ఆర్టిస్ట్‌ల చుట్టూ, డెరైక్టర్ల చుట్టూ తిరిగాను. వాళ్లు ఏదో రకంగా తప్పుకునేవారు తప్ప మాతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది. నాగార్జున యూఎస్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాడు. ఇక వేరేవాళ్ల చుట్టూ తిరిగే ఓపిక లేక, నువ్వు హీరోగా చేస్తావా అని నాగార్జునను అడిగాను. యా ఇట్స్ మై డ్రీమ్ అన్నాడు. ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పాం. ఆయన కూడా ఓకే అన్నారు. అలా మా సారథ్యంలో విక్రమ్ మొదలైంది. అప్పట్లో అదంతా ఒక కలలా జరిగిపోయింది.
 
   మీరెప్పుడైనా హీరో కావాలనుకున్నారా?
 మొదటినుంచీ యాక్టర్ కావాలని అనుకోలేదు. నాన్నగారు ఆ ఆలోచనతో మమ్మల్నెప్పుడూ పెంచలేదు. చిన్నతనం నుంచీ మా ధాట్ ప్రాసెస్‌లో అది లేకపోవడం వల్ల జరగలేదు. కానీ హీరో అయ్యే క్యాపబిలిటీస్ నాలో ఉన్నట్లు నేను నమ్ముతాను. ఆ ఐడియా ఉంటే కచ్చితంగా హీరో అయ్యేవాణ్నేమో. ఆలోచన వచ్చేప్పటికి నేను హీరో వయసు దాటిపోయాను.
 
     తెర వెనుక మీ ఇంట్రస్ట్ ఏమిటి?
 ఒక దశలో డెరైక్టర్ కావాలనుకుని కొన్ని స్క్రిప్ట్‌ల మీద వర్క్ చేశాను. ఎందుకంటే నేను ప్రతీ దశలోనూ ప్రొడక్షన్‌తో ఇన్‌వాల్వ్ అయ్యాను. దాంతో నాకు డెరైక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది. నా టేస్ట్ మల్టీప్లెక్స్ సినిమాలకు దగ్గరగా ఉంటుంది. మన ఆడియన్స్ టేస్ట్, మార్కెట్ రేంజ్ ఆ స్థాయిలో లేదన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం  విరమించాను. ఎప్పటికైనా నా టేస్ట్‌కు తగ్గ సినిమా తీయాలనుంది.. అది కాకుండా ఎడిటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా బ్యానర్‌లో చాలా సినిమాల ఎడిటింగ్‌లో నేను కీ-రోల్ ప్లే చేశాను.
 
     ఒక సక్సెస్‌ఫుల్ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకుడిగా ఉన్న మీరు మధ్యలో ఎందుకు వెనక్కి వచ్చారు?
 
 దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తన వ్యవహారాలన్నీ నేనే చూసుకున్నాను. కథలు వినడం, ఏ నిర్మాతతో సినిమా చేయాలి, ఏ డెరైక్టర్‌తో పనిచేయాలి వంటి విషయాల్లో ఇన్‌వాల్వ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక నాగ్‌కు సొంత నిర్ణయాలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చింది. తనదైన ఐడియాలజీని రూపొందించుకుని తదనుగుణంగా కెరీర్ ప్లాన్ చేసుకునే స్థాయికి చేరుకున్నాడు. అప్పుడు నా అవసరం తనకు లేదనిపించింది. మరోవైపు ఒక దశలో మూవీ మేకింగ్ చాలా రిస్క్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ఆర్గనైజ్డ్ బిజినెస్. అందులోనూ తను కూడా నిర్మాణంలో యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరం చేయడం కరెక్ట్ కాదనిపించింది. నేనిక రిలాక్స్ కావచ్చనిపించింది. ఈ విషయంలో నేను, నాగార్జున ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చాం.
 
     సినీ రంగంలో అక్కినేని వంశం అంటే నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ఆ వరుసలో మీ పిల్లలు ఎక్కడా కనిపించరు ఎందుకని?
 బేసిక్‌గా మా పిల్లలకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు. అబ్బాయి ఆదిత్యకు రేసింగ్ ఇష్టం. నాన్నగారికి ఆదిత్యను హీరో చేయాలని చాలా ఉండేది. తనకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. నేను చాలాసార్లు వాణ్ని అడిగి చూశాను. కానీ తనకు  ఇంట్రస్ట్ లేదని చెప్పాడు. నాకు తను సినిమాల్లోకి హీరోగా వస్తే బాగుండనిపించేది. మన ఆశల కన్నా పిల్లల ఆసక్తులకు ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను.తనకు ఇంట్రస్ట్ ఉన్న రంగం వైపు ప్రోత్సహించాను. ఇప్పుడు అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అమ్మాయి అన్నపూర్ణ ఆర్కిటెక్చర్ చేసి యూఎస్‌లో ఆర్కిటెక్ట్‌గా చేస్తోంది. తన టాలెంట్‌కు బోలెడన్ని అవార్డ్స్ వచ్చాయి. పిల్లలు వాళ్లు ఎంచుకున్న రంగంలో పేరు తెచ్చుకున్నారు. నాకదిచాలు.
     సినిమా నుంచి బయటకు వచ్చాక, ఏ వ్యాపారాలు చేపట్టారు?
 
 నాకు వైజాగ్ బేస్డ్‌గా ఫార్మా కంపెనీ ఉంది. దానికి ఎండీగా ప్రస్తుతం కంపెనీని విస్తరించే పనుల్లో ఉన్నాను. ఇంకా రకరకాల వెంచర్స్ చేస్తుంటాను. అన్నిటికన్నా నాకు ఫార్మింగ్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. చిన్న స్కేల్‌లో హైడ్రోఫోనిక్స్ ద్వారా అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం.
     మీకు, నాగార్జునకు మౌలికమైన తేడాలేమిటి?
 తనకు ఆరోగ్యం పట్ల, తనకు సంబంధించిన ప్రతి విషయంలోను చాలా జాగ్రత్త. బహుశా నేనంత జాగ్రత్తగా ఉండలేనేమో. అదే తేడా.
     మరి మీ ఇద్దరి మధ్య సారూప్యత?
 ఇద్దరికీ చాలా కోపమెక్కువ. అది స్వభావరీత్యా అలవడిందనుకుంటా. ఈ మధ్యే నేను కొంత తగ్గాను.
     మీ ఇద్దరిలో ఎవరు మంచి బిజినెస్‌మ్యాన్?
 నిస్సందేహంగా నాగార్జునే.
     ఇద్దరిలో రిస్క్ చేయడంలో ఎవరు ముందుంటారు?
 ఆ విషయంలో ఇద్దరమూ ముందుంటాం. రిస్క్ చేసే గుణం ఉంది కాబట్టే ఏమాత్రం అనుభవం లేని రామ్‌గోపాల్‌వర్మను దర్శకుడిగా పెట్టి ‘శివ’ తీశాం. రిస్క్ చేసే ధైర్యం ఉంది కాబట్టే నాగార్జున ‘అన్నమయ్య’ చేయగలిగాడు.
     నాగార్జునను నటుడిగా మీరు మెచ్చే సినిమాలు?
 రాజన్న, అన్నమయ్య, రామదాసు. సాయిబాబాలో తన నటన చాలా బాగున్నా, సినిమా సరిగా తీయలేదనేది నా అభిప్రాయం.
     ఇప్పుడు మీ మధ్య ఎలాంటి విషయాల్లో చర్చ జరుగుతుంది?
 మేం వారానికి రెండుసార్లు అన్నపూర్ణ స్టూడియోలో కలుస్తుంటాం. వీలైతే ఆదివారం నాన్నగారి ఇంట్లో అందరం కలుస్తాం. కలిసినప్పుడు మా ఇద్దరిమధ్యా లైఫ్‌స్టైల్, హెల్త్ విషయాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేం ఆలోచించాల్సింది అవే కాబట్టి.  అన్నపూర్ణా స్టూడియోను ఏ రోజుకైనా ఫిలిం ప్రొడక్షన్‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆశయం.    
     మీ అనుబంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?
 ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. అలాగని చాలా దగ్గరగా ఉండే అన్నదమ్ములం కూడా కాదు. అందుకు ఒక కారణం ఏజ్ డిఫరెన్స్. రెండో కారణం... బంధం బలపడే వయసులో ఒక దగ్గర లేకపోవడం. కానీ ఏదైనా అవసరం వస్తే ఒకరి కోసం ఒకరం చాలా గట్టిగా నిలబడతాం.  డబ్బు అంత ప్రయారిటీ కాదు కాబట్టే మా మధ్య అనుబంధం అంత బలంగా వుంది.
     సినిమా, వ్యాపారం... వీటికి దూరంగా మీ హాబీలు?
 నాకు వైల్డ్ లైఫ్, ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాను. ఇప్పుడు పరమహంస యోగానంద రాసిన ‘ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ చదువుతున్నాను.
 - కె.క్రాంతికుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement