మాకు సంబంధం లేదు.. ఖండిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో తమకు సంబంధం లేదని నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ప్రకటించింది. ఈ మేరకు ఎన్ఎస్యూఐ తెలంగాణ అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్ వీడియో శుక్రవారం విడుదల చేశారు. తమ కార్యకర్తలు హింసకు దిగినట్టు వచ్చిన కథనాలను ఆయన ఖండించారు.
సైనిక ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షను రద్దు చేయడం వల్లే అభ్యర్థులు ఆందోళనకు దిగారని వెంకట్ తెలిపారు. ఆందోళనలో తమ కార్యకర్తలు ఎవరూ లేరని అన్నారు. తనను ముందుస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని వెల్లడించారు. తమ పాత్ర లేదని చెప్పడానికే పోలీస్ స్టేషన్ నుంచే వీడియో పంపించినట్టు తెలిపారు. నిరుద్యోగులు సంయమనం పాటించాలని భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు.
‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తమ జీవితాలతో ఆడుకోవద్దని నిరుద్యోగులు కోరుతున్నారు. తాము శాంతియుతంగానే ధర్నా చేశామని, పోలీసులు రెచ్చగొట్టడంతో తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని ‘సాక్షి’ టీవీతో చెప్పారు. (క్లిక్: సికింద్రాబాద్లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం!)