పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే మృతి
పుట్టపర్తి టౌన్ : తూర్పుగోదావరి జిల్లా బూరగపూడి నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు నీరుకొండ వెంకటరత్నమ్మ(95) ప్రశాంతి నిలయంలోని తన నివాసంలో మృతి చెందారు. వయసు మీదపడడంతో పాటు శనివారం ఆమె కొంత అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు సత్యసాయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. 1955లో తూర్పుగోదావరి జిల్లా బూరగపూడి నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆమె భర్త నీరుకొండ వెంకటరామారావు మంత్రిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలి మహిళా శాసన సభ్యురాలిగా వెంకటరత్నమ్మ పేరెన్నికగన్నారు. చాలా ఏళ్లుగా ఆమె ప్రశాంతి నిలయంలో నివసిస్తున్నారు. సంతానం లేకపోవడంతో మేనల్లుడు అబ్బులు చౌదరిని దత్తత తీసుకున్నారు.ఆదివారం పుట్టపర్తి వద్దనున్న చిత్రావతి నదిలో ఆమె దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.