రాజీనామా చేయండి
♦ పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లుకు వైఎస్సార్సీపీ డిమాండ్
♦ టీఆర్ఎస్ తీరుపై పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనం కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న దీక్షను సాకుగా చూపి పార్టీ మారుతున్నట్లు ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీలోని నాలుగు జిల్లాలు, తెలంగాణలో మూడు జిల్లాలపై ప్రభావం చూపించే ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును నిరసిస్తూ జగన్ దీక్ష చేపడుతున్నారని స్పష్టం చేసింది. కానీ దీన్ని సాకుగా చూపి పొంగులేటి తదితరులు పార్టీ మారడం వెనుక మరేవో ప్రయోజనాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘వ్యక్తులు పార్టీ మారినంత మాత్రాన వైఎస్సార్సీపీకి ఏమీ కాదు.
వ్యక్తులు పోతే పార్టీ ఉండదనే భ్రమల్లో ఉండొద్దు. తెలంగాణలో వైఎస్సార్సీపీ పనైపోయిందన్నట్లుగా మంత్రి కేటీఆర్ మాట్లాడడం సరికాదు. ఆయన ఇంత అహంకారంతో మాట్లాడడం మంచిదికాదు. మాటల గారడీతో పబ్బం గడుపుకోవాలంటే కుదరదు. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 104, 108, సాగునీటి ప్రాజెక్టులు తదితర వైఎస్సార్ చేపట్టిన కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చడంపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కడికక్కడ నిలదీస్తామని రాఘవరెడ్డి చెప్పారు. ఏదో ఒక ఎన్నిక వచ్చినప్పుడల్లా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేంత బలహీనంగా టీఆర్ఎస్ ఉందని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణిస్తే... ఆ స్థానాన్ని ఆయన కుటుంబ సభ్యులకు వదిలేయకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకుని బలోపేతం కావాలనే టీఆర్ఎస్ యత్నం దారుణమని విమర్శించారు.
రాజకీయ జన్మనిచ్చిందే వైఎస్సార్సీపీ
వ్యాపారవేత్తగా ఉన్న పొంగులేటికి రాజకీయ జన్మనిచ్చిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాఘవరెడ్డి స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్, జగన్‌లపై ప్రజల్లో ఉన్న ఆదరణ, షర్మిల ప్రచారం వల్లే తెలంగాణలో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లను పార్టీ గెలుచుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. పార్టీ నాయకత్వం పొంగులేటిని ఎంపీగా గెలిపించడంతో పాటు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నియమించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అటువంటి అవకాశాలు అరుదుగా వస్తాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు.
వ్యక్తిగత, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమో, మరి దేనికోసం పొంగులేటి పార్టీ మారి ఉంటారో తమకు తెలియదని... కానీ నయానో, భయానో, దం డోపాయంతోనో, లోపాయికారీగానే చేర్చుకుని ఉంటారని వ్యాఖ్యానించారు. ఏ ప్రాజెక్టును చూపి పొంగులేటి టీఆర్ఎస్లో చేరారో.. ఆ ప్రాజెక్టు వల్లే సాగర్ ఎడమ కాలు వ ఆయకట్టు నాశనమవుతుందని చెప్పారు. దీంతో ఖమ్మం జిల్లా ఎడారిగా మారుతుందని... నల్లగొండ పూర్తిగా, మహబూబ్నగర్జిల్లాలోని కొన్ని మండలాలు నష్టపోతాయని తెలిపారు.
ఇక వైఎస్సార్ ప్రారంభించిన 30 ప్రాజెక్టులకు రూ.10వేలకోట్లు కేటాయిస్తే ఏకంగా 40 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వాటిని పూర్తిచేస్తే ఎక్కడ వైఎస్సార్‌కు కీర్తిప్రతిష్టలు దక్కుతాయోననే ప్రాజెక్టుల రీడిజైన్ అంటున్నారని, ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇక పార్టీల విలీన ం ఉంటుందేగానీ, ఎమ్మెల్యేల చేరికతో పార్టీ విలీనం కావడమంటూ ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా రాఘవరెడ్డి చెప్పారు.
రేపు పార్టీ సమావేశం
గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపింది. భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కొండా రాఘవరెడ్డి వెల్లడించారు.