స్వగ్రామానికి నాగమణి మృతదేహం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : కువైట్‌లో మృతిచెందిన యాళ్ల నాగమణి మృతదేహం కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు కృషితో శుక్రవారం రాత్రి ఆమె స్వగ్రామం వీరవాసరం మండలం మెంటేపూడికి చేరింది. ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టుకు చేరిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. జీవనోపాధి కోసం నాగమణి రెండున్నర సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లింది.
అనారోగ్య కారణంగా ఈనెల 4వ తేదీన అక్కడ మృతి చెందింది. ఆమె భర్త వెంకటేశ్వరరావు తన భార్య మృతదేహాన్ని ఇండియాకు రప్పించాల్సిందిగా కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విన్నవించుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సహకారంతో ఆయన ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాలను సంప్రదించారు. నాగమణి మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు.
హైదరాబాద్‌లోని మైగ్రెంట్‌రైట్స్ కౌన్సిల్ సహకారంతో ప్రభుత్వం ద్వారా ఉచితంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
రాత్రి తాడేపల్లిగూడెంలో అంబులెన్స్‌ను నిలుపుదల చేసి గట్టిం మాణిక్యాలరావు, నార్ని బావాజీలు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు, పెంటపాటి పుల్లారావులకు మృతురాలి భర్త వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ సభ్యులు తిరుమళ్ల పాండురంగారావు, ధర్మవరపు శ్రీనివాస్, మేడవరపు రామలింగేశ్వరరావు, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు.