రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్(పశ్చిమగోదావరి జిల్లా): హత్య కేసులో విచారణ ఎదుర్కొంటూ ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఖైదీ సోమవారం ఇనుప రేకుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు సూపరింటెండెంట్ డి.రాఘవేంద్రరావు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన యమ్మిగంటి వీరవెంకట వరప్రసాద్ దాదాపు రెండేళ్ల క్రితం సొమ్ము కోసం అమ్మమ్మను హత్య చేసినట్టు కేసు నమోదైంది. తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు హత్యను కళ్లారా చూసిన ఐదేళ్ల చిన్నారిని సైతం హతమార్చినట్టు అభియోగం ఎదుర్కొంటున్నాడు.
విజయవాడ పోలీసులు అత న్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. విజయవాడ జైలులో ఖాళీ లేకపోవడంతో పోలీసులు నిందితుడిని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో నిందితుడు వరప్రసాద్ 18నెలలుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సోమవారం విజయవాడలోని మహిళా కోర్టులో విచారణ నిమిత్తం హాజరుకావాల్సి ఉండగా, తనకు జైలు శిక్ష తప్పదనే భయంతో ఉదయం బాత్రూమ్ డోర్ రేకుతో వరప్రసాద్ గొంతుకోసుకున్నాడు. జైలు సిబ్బంది అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.