Verdict Notice
-
సుప్రీంకోర్టును మోసం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టును కేంద్రం మోసం చేసిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. రఫేల్ కేసులో డిసెంబర్ 14న వచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రీజాయిండర్ అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు. తప్పుడు ఆధారాలు చూపి, సరైన పత్రాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఆ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికి కూడా నిజమైన పత్రాలను కోర్టు ముందు ఉంచట్లేదని, అందుకే తాము నిజమైన పత్రాలను బహిర్గతపరచాలని డిమాండ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ‘సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేసిన వివరాలతో కేంద్రం తప్పుదోవపట్టించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆధారాలను కేంద్రం తొక్కిపట్టి కోర్టు నుంచి తప్పుడు తీర్పు పొందింది’ అని ఆరోపించారు. రఫేల్ కేసు తీర్పుపై సమీక్ష జరపాలని పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు స్పందనగా ఆ ముగ్గురు రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, రఫేల్ తీర్పుపై సమీక్ష జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. వారి ఆరోపణలు నిరాధారం.. రఫేల్ కొనుగోలు కేసులో పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రక్షణ శాఖ నుంచి లీక్ అయిన పత్రాల ఆధారంగా వచ్చిన వార్తాకథనాలపైనే వారు ఆధారపడ్డారని పేర్కొంది. ఇది కచ్చితంగా అధికారులు వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే అవుతుందని వెల్లడించింది. -
కాంగ్రెస్‌లో కార్తీ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌కు మరో తలనొప్పి ఎదురైంది. పార్టీలో కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కల్లోలం సృష్టించాడు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించాడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజాయిషీ నోటీసు అందుకున్నాడు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంపై తగిన వివరణ ఇవ్వకుంటే అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం ప్రకటించారు. ఇటీవల సత్యమూర్తి భవన్లో జరిగిన కామరాజర్ గురించి మాట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీనే లేదని ఇళంగోవన్ వెంటనే కార్తి మాటలను తిప్పికొట్టారు. కార్తీ వ్యాఖ్యలపై గందరగోళం నెలకొంది. కొందరు నిరసన నినాదాలతో ఆందోళన చేశారు. ఆగ్రహించిన కార్తీ చిదంబరం బలనిరూపణగా ‘ఐ 67’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం అయిన 1967 తరువాత జన్మించిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకున్నారు. ఐ 67కు సంబంధించిన సమావేశాన్ని గురవారం జరిపారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున సుమారు 234 మందిని కార్తీ పిలిపించారు. లౌకికపార్టీ అనే ప్రచారానికే పరిమితమైతే ఫలితం లేదు, ప్రజాకర్షణ కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కార్తీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేగా సినిమా ప్రముఖులు వెంటపడటం మానుకోవాలని పరోక్షంగా నటి కుష్బును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేగాక రాష్ట పార్టీ కార్యకలాపాలను సైతం విమర్శించారు. కార్తీకి నోటీసు : ఇళంగోవన్ నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా సత్యమూర్తి భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఇళంగోవన్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్తీ చిదంబరం పార్టీ నియమావళికి విరుద్దంగా పోటీ సమావేశాన్ని నిర్వహించారని, అనేక విమర్శలు చేశారని మీడియాతో చెప్పారు. కామరాజనాడార్ గురించి మాట్లాడుకుంటే ప్రయోజనం లేదని వ్యాఖ్యానించాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీచేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన కార్తీని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని పేర్కొన్నట్లు చెప్పారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.