మొదట బేబీకి ముద్దులు.. రెండో బేబీకి హద్దులు!
లాస్ ఏంజిల్స్:క్రిస్టన్ బెల్(39).. 'వెరోనికా మార్స్ ' అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటి. డాక్స్ షెపర్డ్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం ఒక పాపకు తల్లి కూడా. ఆ పాపతో బిజీగా ఉన్న బెల్.. రెండో సంతానానికి అపుడే తొందరలేదంటోంది. రెండోసారి గర్భం దాల్చి.. పాపకో, బాబుకో జన్మనివ్వడానికి తొలుత ఆసక్తి కనబరిచిన క్రిస్టన్ బెల్ .. ఇప్పుడు కాస్త వెనుకడుగు వేసింది. మొదటి బేబీ ముద్దులతో మురిసిపోతున్న ఈ అమ్మడు.. రెండో బేబీకి హద్దులు గీసుకుంది.
ప్రస్తుతం ఆ దిశగా దృష్టి పెట్టలేదు. 'నేను రెండోసారి గర్భం దాల్చడంపై మరికాస్త సమయం తీసుకొనున్నాను. ప్రస్తుతం నా 15 నెలల పాపతో బిజీగా ఉన్నాను. ఆ చిన్నారితో ఆడుతూ పాడుతూ ఉంటుంటే సమయం తెలియడం లేదు' అని బెల్ వెల్లడించింది. ఇదిలా ఉండగా తన జీవితంలో రాబోయే రెండో చిన్నారి కోసం ఏ పేరు పెట్టాలనే ఆలోచనలో పడింది బెల్.