మైక్రోసాఫ్ట్ బృందం వర్సిటీల సందర్శన
ఏఎన్‌యూ: మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధి బందం బుధవారం యూనివర్సిటీని సందర్శించింది. ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ సంస్థ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తరుణంలో ఆ సంస్థ ప్రతినిధులు ఏఎన్‌యూని సందర్శించటం ప్రాధాన్యాన్ని సందర్శించుకుంది. మైక్రోసాఫ్ట్ అమెరికా సంస్థ ప్రతినిధులు మైక్ డేరో, మారియా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రవి, మైక్రోసాఫ్ట్ బెంగళూరు బ్రాంచ్ ఇన్ఛార్జ్ అరుణారెడ్డి, హైదరాబాద్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రభు ఏలిశెట్టి, ఎన్ఆర్ఐ డాక్టర్ ప్రసాద్‌తో కూడిన ప్రతినిధి బృందం ఏఎన్‌యూలోని విద్య, పరిశోధన, మౌలిక వసతులను పరిశీలించింది. అనంతరం పరిపాలనా భవన్లో వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్, వర్సిటీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఐటీ సంబంధిత విద్య, పరిశోధనల గురించి అధికారులు వివరించారు.. వృత్తి విద్యా కోర్సులకు ఉపయోగపడేలా మైక్రోసాఫ్ట్ నుంచి సహకారమందించాలని కోరారు. ఏఎన్‌యూలో మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో డేటా ఎనాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఏపీలో మైక్రోసాఫ్ట్ సేవలు విస్తరిస్తున్నాం..
డైక్మెన్ ఆడిటోరియంలో యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చర్చాగోష్టి నిర్వహించారు. మైక్ డేరో మాట్లాడుతూ ఏపీలో మైక్రోసాఫ్ట్ సేవలను విస్తరించనున్నామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఆవిర్భావం, దాని సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రతినిధులు సమాధానాలిచ్చారు.