మెట్రో-1 ‘లెక్క’ తేల్చండి
సాక్షి, ముంబై: నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో మొదటి విడత ప్రాజెక్టుకు సంబంధించిన కాగ్ ఆడిట్ పెండింగులో పడిపోయింది. ఇది చార్జీల పెంపు కొత్త ప్రతిపాదనపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మెట్రో ప్రాజెక్టు కాగ్ ఆడిట్ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ప్రతిపాదన పంపించింది. కొత్త చార్జీలు నిర్ణయించే ముందు మెట్రోకు ఎంతమేర ఖర్చయిందనేది తప్పనిసరిగా తేల్చాసి ఉంటుంది. దీంతో కాగ్ ఆడిట్ తప్పనిసరి చేయాల్సి వస్తుందని అధికారులు అన్నారు.
ప్రస్తుతం వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య మెట్రో రైలు ప్రయాణానికి కనీస చార్జీ రూ.10 ఉండగా, ఆ తర్వాత దూరాన్ని బట్టి రూ.15, 20 ఇలా వసూలు చేస్తున్నారు. కాగా ఇంత తక్కువ చార్జీలతో మెట్రోలాంటి ఖరీదైన సేవలు అందించాలంటే గిట్టుబాటు కాదని ఇదివరకే మెట్రో-1 స్పష్టం చేసింది. కాని కొద్ది నెలల వరకు చార్జీలు పెంచకూడదనే షరతులపైనే అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, 2015 జనవరి నుంచి కొత్త చార్జీలు అమలులోకి తెచ్చేందుకు మెట్రో-1 కసరత్తు చేస్తోంది. కాని కాగ్ ఆడిట్ పనులు ప్రారంభం కాకపోవడంతో పాత చార్జీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
ఇదిలాఉండగా, టికెట్ చార్జీలపై ముంబై మెట్రో-వన్ ప్రైవేటు లి.కంపెనీ, ఎమ్మెమ్మార్డీయేల మధ్య నెలకొన్న వివాదం హై కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు తీర్పు కోసం ఎదురుచూస్తోంది. కాని కొత్త చార్జీలు అమలు చేయాలంటే కాగ్ ఆడిట్ నివే దిక తప్పనిసరి. మెట్రో మొదటి దశ పనులు పూర్తిచేయడానికి ముంబై మెట్రో-1 ప్రై. లి. కంపెనీ రూ.నాలుగు వేల కోట్లు ఖర్చయ్యాయని పేర్కొంది. కాని ఎమ్మెమ్మార్డీయే రూ.2,356 కోట్లు ఖర్చయ్యాయని స్పష్టం చేసింది.
దీంతో పరిష్కార మార్గం కనుగొనేందుకు మెట్రో-1 కంపెనీ జూలైలో కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. దీన్ని కాగ్ ద్వారా ఆడిట్ చేయించాలని అందులో పేర్కొంది. కాని ఇంతవరకు కాగ్ పనులు ప్రారంభించకపోవడంతో ఎమ్మెమ్మార్డీయే కూడా కేంద్రానికి లేఖ రాసింది. కాగ్ ఆడిట్ పనులు పూర్తయితే మెట్రో-1 పనులకు కచ్చితంగా ఎంతమేర ఖర్చయిందో స్పష్టం కానుంది. కాని జాప్యం జరిగితే చార్జీల పెంపు కూడా వాయిదా పడడం ఖాయమని మెట్రో-1 పరిపాలన విభాగం ఆందోళన చెందుతోంది.