‘మెట్రో’ మూడో దశ త్వరలో టెండర్లు
సాక్షి, ముంబై: మెట్రో మూడో దశ పనులను చేపట్టాలని నిర్ణయించిని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది. ఈ విషయాన్ని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వర్సోవా-ఘాట్కోపర్ మెట్రో ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేయలేకపోయామన్నారు. అయినప్పటికీ ఈసారి ఒప్పందం మేరకు గ డువులోగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో మూడో దశ పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామన్నారు. 32.5 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు పలు చోట్ల భూగర్భమార్గంగుండా వెళుతుందన్నారు. 2015 జూలైలో ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు రూ.23,136 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనావేశామన్నారు. కాగామూడో దశ ప్రాజెక్టులో మొత్తం 27 స్టేషన్లు ఉంటాయి. గోరేగావ్‌లోని అరే కాలనీలో తప్ప మిగతా స్టేషన్లన్నింటినీ భూగర్భంలోనే నిర్మించనున్నారు. భూగర్భ నిర్మాణ పనులను సగటున 15 నుంచి 25 మీటర్ల లోతు వరకు చేపట్టనున్నారు.
కార్ డిపో కోసం అరే కాలనీలో 30 హెక్టార్ల స్థలాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ)తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చనున్నాయి.