ఆ బాలికకకు ఎంతకష్టం
కాళ్ల వాపుకు ఆర్ఎంపీ వైద్యం l
తుదకు రెండు కాళ్లూ తొలగింపు ∙
తాజాగా కిడ్నీల సమస్యతో తీవ్ర అనారోగ్యం
చింతూరు:
పదిహేనేళ్ల చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్ఎంపీ వైద్యంతో ఇప్పటికే రెండు కాళ్లూ కోల్పోయిన ఆ బాలికకు ప్రస్తుతం కిడ్నీలు కూడా పాడవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. వీఆర్పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన పెట్టా దుర్గాభవానీ ఏడాది క్రితం టెన్త్ చదువుతుండగా కాళ్లవాపు వ్యాధి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యం అనంతరం కాళ్లు ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయి తమ కుమార్తె నడవలేని స్థితిలోకి చేరుకుందని వివరించింది. తర్వాత తన బిడ్డను భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి విజయవాడ తీసుకెళ్లమని సూచించారని తెలిపింది. ఆ ప్రకారం విజయవాడ తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి రెండు కాళ్లను తొలగించారని తల్లి పేర్కొంది. కొంతకాలంగా దుర్గాభవానీ అనారోగ్యంతో బాధపడుతోందని, తన బిడ్డకు న్యాయం చేయాలని ఇటీవల తమ గ్రామం వచ్చిన మంత్రిని కూడా వేడుకున్నామని సత్యవది ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఆదివారం రాత్రి తన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో రేఖపల్లి ఆసుపత్రిలో చూపించామని, అక్కడి వైద్యుల సూచనతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కాకినాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని సత్యవతి వివరించింది. తన కుమార్తె ఆరోగ్యంపై ఆమె ఆందోళన వెలిబుచ్చింది. కాగా ఈ విషయంపై వైద్యులను అడగ్గా, బాలిక కిడ్నీల్లో సమస్య ఉండడంతో పరిస్థితి విషమంగా ఉందన్నారు. అందుకే కాకినాడ ఆస్పత్రికి రిఫర్ చేసిన ట్టు తెలిపారు.