జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
కాకినాడ సిటీ :
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. మెడ భాగం దెబ్బతిని కదలలేని స్థితిలో వచ్చిన రోగికి న్యూరోసర్జరీ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రేమ్‌జిత్ రే నేతృత్వంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరి, ఎనస్ధీసియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారావు బృందం కోలుకునేలా వైద్యసేవలు అందించారు. వైద్యబృందం శనివారం ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన గోడి వీరభద్రుడు ఇంటి అరుగు మీద నుంచి కిందకు పడడంతో ఎటూ కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. అతనిని గతనెల 14వ తేదీన జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. అతనికి స్కానింగ్, ఎక్స్‌రేలు తీయగా మెడ వద్ద వెన్నుపూస విరిగి పోవడంతో పాటు, నరాలు నలిగిపోయినట్టు వైద్యులు గుర్తించారు. సెప్టెంబర్ 24న మెడ వెనుక, ముందు భాగాల్లో శస్త్ర చికిత్స చేసి విరిగి ఒకదానిపైకి ఒకటి చేరిన వెన్ను పూసలను సరిచేసి మెటల్ ప్లేట్‌ను అమర్చి స్క్రూలు వేశారు. ఈమేజర్ సర్జరీకి ఆరుగంటల సమయం పట్టిందని, జీజీహెచ్‌లో ఇటువంటి శస్త్ర చికిత్స చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. కాళ్లు, చేతులు కదపలేకుండా అంతంత మాత్రం స్పర్శతో ఉన్న వీరభద్రుడు ఆపరేషన్ అన ంతరం కోలుకుని ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా తిరగగలుగుతున్నాడన్నారు.