viaipi Reporter
-
టెన్షన్ వద్దు
vip రిపోర్టర్ కాగిత శామ్యూల్ ఇన్చార్జి డీఈవో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇన్చార్జి డీఈవో శామ్యూల్ ‘సాక్షి’ విఐపీ రిపోర్టర్‌గా మారారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పలు సూచనలు ఇచ్చారు. ఇన్చార్జి విద్యాశాఖాధికారి కాగిత శామ్యూల్ జిల్లాలోని సర్కారు బడుల పనితీరు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకోవాలన్నారు. అధికారిగా వెళితే ముందుగానే సమాచారం తెలుసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త పడతారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలియవు. ఆకస్మిక తనిఖీకి వెళ్లినా అక్కడేం జరిగిందనేది పూర్తిగా బయటకు రాదు. విషయం రాబట్టాలంటే రొటీన్‌కు భిన్నంగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారిపోయారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని నీరుగట్టువారిపల్లె శ్రీవివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పదో తరగతి పరీక్షల్లో మెరుగైనా ఫలితాల కోసం ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాలలో గడిపారు. పర్యటనలో ఆయన జరిపిన సంభాషణలు.. ప్రజెంటేషన్ : చిట్టెం సుధాకర్, మాడా చంద్రమోహన్ పదో తరగతి తరగతి గది: ఇన్చార్జి డీఈవో : మీ పాఠశాలలో పదో తరగతి సిలబస్ పూర్తయ్యిందా? విద్యార్థిని(గాయత్రి): అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ పూర్తి చేశారు. టీచర్లు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : మీ సెక్షన్లో ఎంతమంది ఉన్నారు? విద్యార్థిని : 52 మంది ఉన్నారు సార్ ఇన్చార్జి డీఈవో: టీచర్లు అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా చెప్పారా? విద్యార్థిని(లక్ష్మి) : చెప్పారు సార్, ప్రతి రోజూ స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి డీఈవో : నీకు ఏ సబ్జెక్టు ఇష్టం? విద్యార్థిని (వాణి ప్రసన్న) : బయాలజీ సార్ ఇన్చార్జి డీఈవో : కష్టమైన సబ్జెక్టు ఏది? విద్యార్థిని : ఫిజిక్స్ సార్ ఇన్చార్జి డీఈవో : ఎందుకు కష్టం? మీసార్లు సరిగా చెప్పడం లేదా ? అర్థం కావడం లేదా? విద్యార్థి(అరవింద్): ఫిజిక్స్‌లో ఫార్ములాలు ఉంటాయి సార్ ఇన్చార్జి డీఈవో: కష్టమైనా ఇష్టంగా చదివితే మంచి మార్కులు వస్తాయి. సరే.. నీవు స్కూలుకు ఎన్ని గంటలకు వస్తావు? విద్యార్థి(అరవింద్) : ఉదయం 6 గంటలకు వచ్చి 7.30 వరకు స్టడీ అవర్స్, మళ్లీ ఇంటికి వెళ్లి 8.30కు వచ్చి సాయంత్రం 7.30 వరకు ఉంటాం. ఇన్చార్జి డీఈవో : ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూలులో ఉంటే బోర్ కొట్టదా? విద్యార్థిని(నందిని): ఇంటికి వెళ్లి కొంతసేపు రిలాక్స్ అవుతాం? ఇన్చార్జి డీఈవో : ఇంటికి వెళ్లి టీవీలో సినిమాలు, సీరియల్స్ చూస్తారా? విద్యార్థిని(నందిని) : కొద్దిసేపు చూస్తాం. ఇన్చార్జి డీఈవో : నీవు టీవీలో ఏం చూస్తావు? విద్యార్థిని(భువనేశ్వరి) : న్యూస్ చూస్తాను సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఏం చూస్తావమ్మా? విద్యార్థిని(జోత్స్న): మ్యూజిక్ చానల్లో పాటలు చూస్తాను. ఇన్చార్జి డీఈవో : ఎందుకు చూస్తావు? విద్యార్థిని: రిలాక్స్ కావడానికి మ్యూజిక్ అవసరం సార్ ఇన్చార్జి డీఈవో : నీవు ఎంత సేపు టీవీ చూస్తావు? విద్యార్థి (సునీల్‌కుమార్) : గంటసేపు చ ూస్తాన్ సార్. ఇన్చార్జి డీఈవో : అంతసేపు చూడటం వల్ల పాఠాలపై శ్రద్ధ పోతుంది. కొద్దిసేపు చూసిన తర్వాత పాఠాలు చదవాలి. సీరియల్స్, సినిమాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి.రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో, ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకోవడంతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం చూసుకుంటే మంచి మార్కులు వస్తాయి. పరీక్షలు రాబోతున్నాయి కదా మీకు భయం లేదా? విద్యార్థి (అరవింద్) : భయంగా ఉంది. మొదటిసారి రాస్తున్నాం కదా సార్. ఇన్చార్జి డీఈవో : అందుకోసమే ఇన్స్పైర్ వంటి కార్యక్రమాలు పెట్టాం. ఇప్పటి నుంచి ఇష్టంగా చదివి బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఇంతకీ ఇన్స్పైర్ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందా? విద్యార్థిని (దుర్గ) : ఉపయోగపడింది సార్. ఇన్చార్జి డీఈవో : ఇన్‌స్పైర్‌కు ఎవరైనా ఎంపికయ్యారా? హెచ్ఎం (శ్రీనివాసులు) : మా విద్యార్థి అరవింద్ జిల్లాలో మొదటి స్థానం వచ్చారు. ఇన్చార్జి డీఈవో : వెరీగుడ్, బాగా చదవాలి. (అంటూ మెమెంటోను విద్యార్థికి అందజేశారు) రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఇష్టపడి చదవండి. మంచి మార్కులు సాధిస్తారు. ఆల్ ది బెస్ట్..! ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం ఇన్చార్జి డీఈవో : పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి? హెచ్ఎం (శ్రీనివాసులు) : ఉపాధ్యాయులందరూ కలిసి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. సబెక్టుల వారీగా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఈసారి మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కష్టపడాలి. పదో తరగతి విద్యార్థిని తండ్రికి ఫోన్ చేసి.. ‘‘హలో.. నేను డీఈవోను మాట్లాడుతున్నా.. మీ పాప చదివే పాఠశాలలో ఉన్నా. మీ పాప ఎలా చదువుతుందో కనుక్కుంటున్నా.. మీ పాపను బాగా చదివించండి.. టీవీ సీరియల్స్‌ను చూపించకండి.. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ఇన్స్పైర్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. వెనుబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. గతంలో మదనపల్లె డివిజన్లో మాత్రమే ఇన్స్పైర్ కార్యక్రమం అమలవుతుండగా ఈ ఏడాది జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఉత్తమ మార్కులు సాధించిన దాదాపు 800 మంది విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం’’ డీఈవోతో ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్.. వెంకటరమణ (ఎస్ఎంసీ చైర్మన్) : సార్ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు అసరానికి సరిపడా లేవు. కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. అలాగే విద్యార్థులకు అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. క్రీడా మైదానం అవసరం. ప్రతియేటా పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇన్చార్జి డీఈవో: తప్పకుండా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తాను. మధ్యాహ్న భోజన వంటగది పరిశీలన ఇన్చార్జి డీఈవో : ఏమ్మా.. ఈ రోజు అన్నం, కూరలు ఏం చేస్తున్నావు? వంట ఏజెన్సీ నిర్వాహకురాలు(భూదేవి) : సార్ అన్నం, బీన్సు సాంబార్ చేస్తున్నాం. ఇన్చార్జి డీఈవో: ఎంతమంది విద్యార్థులకు వండుతున్నావు? ఏజెన్సీ నిర్వాహకురాలు : 1,200 మంది విద్యార్థులకు సార్ ఇన్చార్జి డీఈవో : వారంలో కోడిగుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు? ఏజెన్సీ నిర్వాహకులు : రెండుసార్లు సార్ ఇన్చార్జి డీఈవో: రెండుసార్లు తప్పకుండా ఇవ్వాలి. అన్నం ఇంకా బాగా ఉడకాలి (అన్నం రుచి చూస్తూ).. సాంబారులో ఎంత పప్పు వేశావమ్మ? ఏజెన్సీ నిర్వాహకులు : 7 కేజీలు సార్ ఇన్చార్జి డీఈవో : పప్పు తక్కువ వేశారు. నాణ్యమైన కూరలు ఇవ్వాలి. ఏజెన్సీ నిర్వాహకులు :అలాగే సార్ ఇన్చార్జి డీఈవో : మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. నాణ్యత లేకుంటే క్షమించే ప్రసక్తే లేదు. మజ్జిగ ఇస్తున్నారా? ఏజెన్సీ నిర్వాహకులు : ఇవ్వలేదు సార్. ఇన్చార్జి డీఈవో : వంట చేసేందుకు డబ్బులు అందాయా? ఏజెన్సీ నిర్వాహకులు : లేదు సార్. ఇన్చార్జి డీఈవో : త్వరలో బడ్జెట్ వస్తుంది. అందేలా చర్యలు తీసుకుంటాం. మెను ప్రకారం భోజనం అందించాలి. శుచితో పాటు శుభ్రత పాటించాలి. డీఈవో హామీలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక నాణ్యతతో కూడిన విద్యే లక్ష్యం తగిన తరగతి గదుల నిర్మాణం -
బూర్గుపల్లిని బాగు చేస్తా...
సమస్యల పరిష్కారానికి పాటుపడతా గ్రామాన్ని ప్రగతిపథాన నడిపిస్తా ఎక్కువ నిధులు మంజూరయ్యేలా చూస్తా వికారాబాద్ మండలంలోని బూర్గుపల్లి ఓ కుగ్రామం.. జిల్లా కేంద్రంగా కలలుగంటున్న పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఆశించినస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. బూర్గుపల్లి రహదారి మార్గ మధ్యలో అధ్వానంగా మారడంతో అదనంగా నాలుగు కిలోమీటర్లు తిరిగి వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు సక్రమంగా లేకపోవటం తదితర సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు. తాగునీటి పైపులైన్ లేక ఎస్సీ కాలనీవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు బూర్గుపల్లిలో పర్యటించారు. అమ్మా.. అక్కా.. చెల్ల్లీ.. తమ్ముడూ.. పెద్దయ్య అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి పాటుపడతానని.. గ్రామాభివృద్ధికి ఎక్కువ నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని, ప్రజలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మా .. బాగున్నవా? రాములమ్మ: ఏం బాగ సార్.. ఆర్నెల్ల నుంచి పింఛన్ ఇస్తలేరు. సార్లను అడిగితే సప్పుడు జేయకుండపోతున్నరు. మా ఊల్ల శానమందికి పింఛన్లు ఒస్తలేవు. ఎమ్మెల్యే: పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నవా.. ఎందుకు ఇస్తలేరు? రాములమ్మ: అభయహస్తం పింఛన్ ఇస్తమని సంఘాలల్ల పైసలు కట్టిపిచ్చుకున్నరు. కొన్ని దినాలు పింఛన్లు ఇచ్చిన్రు. ఓట్లప్పటి నుంచి ఇస్తలేరు. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి సమస్య తెలుసుకుంటా. గ్రామంలో డబ్బులు చెల్లించిన వారందరికీ అభయహస్తం పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏమ్మా.. అంత మంచిదేనా.. ఏమైనా సమస్యలున్నాయా? జహంగీర్‌బీ: సార్ .. అంత బాగానే ఉన్నంగాని రేషన్ కార్డు ఇస్తలేరు. బియ్యం ఇయ్య లేదు. ఎమ్మెల్యే: దరఖాస్తు చేసుకున్నవా.. ఇంతకు ముందు బియ్యం వస్తుండెనా? జహంగీర్‌బీ: ముందుగల్ల వస్తుండె సారూ.. మొన్ననే రాలేదు. దరఖాస్తు గూడ ఇచ్చిన. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడతా. మీకు తప్పకుండా రేషన్ బియ్యం వచ్చేలా చూస్తా. ఈశ్వరమ్మ: సార్.. మా కాలనీల రోడ్లు బాగలేవు. మురికి నీళ్లన్నీ రోడ్డులోంచి, ఇళ్ల మధ్య నుంచి పోతున్నయ్. మురుగు కాలువలు కూడా లేవు. ఎమ్మెల్యే: అమ్మా.. మీ సమస్య అర్థమయ్యింది. వెంటనే ఇంజినీర్లను పంపిస్తా. ప్రతిపాదనలు సిద్ధం చేయించి పంపమని ఆదేశిస్తా. నిధులు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మాణం చేపట్టేలా చూస్తా. దండు యాదమ్మ: సార్.. మాకు ఇల్లు లేదు. మంజూరు చేయించుండ్రి. ఎమ్మెల్యే: అధికారులను పంపిస్తా. విచారణ జరిపి అర్హత ఉంటే ఖచ్చితంగా ఇల్లు మంజూరయ్యేలా చూస్తా. ఎమ్మెల్యే: ఏం బాబు ఎలా ఉన్నారు. మీ సమస్యలేమిటి? రమేష్: అంతబాగానే ఉన్నం సార్.. ఇళ్ల మధ్య పెంటకుప్పలతో ఇబ్బందిగా ఉంది. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయి. చాలాసార్లు పంచాయతీ వాళ్లకు చెప్పినం. ఎవరూ పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే: నేను పంచాయతీ కార్యదర్శితో మాట్లాడతా. ఇప్పుడే మీ సర్పంచ్‌కు కూడా చెబుతున్న. పెంటకుప్పలు తీసివేసేందుకు 15 రోజుల్లో చర్యలు తీసుకుంటా. కుర్వ సుధాకర్: సార్.. మా కాలనీలో రోడ్లు బాగలేవు. కొంచెం వాన పడినా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఎమ్మెల్యే: త్వరలో మీ గ్రామానికి పంచాయతీరాజ్ ఈఈని పంపిస్తా. ప్రతిపాదనలు సిద్ధం చేయించి రోడ్లు, డ్రైనేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటా. ఎమ్మెల్యే: ఏం పెద్దాయనా.. ఎలా ఉన్నావ్, అంతా మంచిదేనా? కావలి రాంచంద్రయ్య: సార్ బాగున్నం. మాకో ఇల్లు ఉంది. ఇల్లు ఉందని గతంలో ఇల్లు ఇయ్యలేదు. ఉన్న ఇల్లు మొత్తం వానొస్తే కురుస్తది. ఎమ్మెల్యే: సరే పెద్దాయనా.. అధికారులు వచ్చి చూస్తారు. త్వరలో మూడున్నర లక్షలతో డబుల్ బెడ్రూంతో కూడిన ఇల్లు ప్రభుత్వమే కట్టించి ఇస్తది. ఫికర్ చేయకు. కె.పెంటయ్య: సార్.. ఇండ్ల నడుమ ఉన్న బాయితో బాగ ఇబ్బంది ఉంది. పిల్లలు, పశువులు అక్కడికి పోకుండా కావలిగాయాల్సి ఒస్తుంది. జర గా బాయిని కూడిపేసి పుణ్యం గట్టుకోండి. ఎమ్మెల్యే: మీ సమస్య అర్థమయ్యింది. అధికారులు వచ్చి ఆ బావిని చూస్తారు. నీళ్లుంటే బాగు చేయించి అందుబాటులోకి తెస్తాం. లేదంటే ఉపాధిహామీ అధికారులకు చెప్పి పూడ్చి వేయిస్తాం. మల్లేశం: సార్ .. మా ఊర్ల పంటలు మొత్తం పాడైపోయినయ్. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే: వెంటనే అధికారులతో వివరాలు సేకరించి నష్టపరిహారం వచ్చేలా చూస్తాం. పెంటయ్య: సార్.. గల్లీల్ల ఇండ్ల నడిమికెళ్లి మురికినీళ్లు పోతున్నయ్, మోరీలు లేవు. ఎమ్మెల్యే: మీ కాలనీలో మురుగు కాలువల నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరిస్తా. శ్రీనివాస్: సార్.. మాకు ఉండనీకె ఇల్లు లేదు. ఎలక్షన్ల కంటె ముందు ఇల్లు మంజూరైంది. సగం వరకు కట్టుకున్నం. అప్పుడే ఎలక్షన్లు వచ్చినయ్. ఆ కారణంతో ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదు. ఎమ్మెల్యే: ఇళ్ల విషయంలో విచారణ జరుగుతున్నందున బిల్లులు ఆపారు. హౌసింగ్ ఏఈతో మాట్లాడి నీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తా. సుజాత: సారు.. నా కొడుకు పేరు పవన్. ఈనికి మాటలు రావు, మూగోడు. మైండు గూడ పనిచేయది. సదరం సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇస్తలేరు. ఎమ్మెల్యే: సరేనమ్మా.. మీకు కొత్తగా సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తా. అధికారులకు చెప్పి నీ కొడుకుకు పింఛన్ ఇప్పించే బాధ్యత నాది. ముఖ్తార్పాష: సార్.. కరెంటోళ్లు నానా ఇబ్బందులు పెడుతున్నరు. చేనికాడ కరెంటు కోసం డీడీ కట్టి ఐదేండ్లు అయ్యింది. ఇంకా కరెంటు ఇస్తలేరు. ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి స్తంభాలు, వైరు ఇప్పించి కనెక్షన్ ఇచ్చేలా చూస్తా. ఎమ్మెల్యే: ఏం పెద్దమ్మా బాగున్నవా.. ఏం పనులు చేస్తున్నరు? కిష్టంపల్లి లక్ష్మి: సారు.. నా బాధ ఎవరి చెప్పుకోవాలె. ఆనకాలంల ఇల్లు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన ఇంట్లనే ఉంటున్న. ఎమ్మెల్యే: నీ సమస్య అర్థమయ్యింది. గ్రామస్తులంతా చెబుతున్నరు. సర్కారు కొత్త ఇళ్లు మంజూరు చేస్తుంది. అప్పటి వరకు ఆ కూలిపోయిన ఇంట్ల ఉండకు. ఎవరింట్లోనైనా ఉండు. మాణెమ్మ: సార్.. మాకు డ్వాక్ర బిల్డింగు లేదు. చెంట్ల కింద మీటింగులు పెట్టుకుంటున్నం. బిల్డింగు మంజూరు చేయిండ్రి. ఎమ్మెల్యే: తప్పకుండా.. నిధులు మంజూరు చేసి మీకు డ్వాక్రా బిల్డింగ్ కట్టిస్తం. రాజు: సార్.. మాకు కమ్యూనిటీ హాల్ కోసం నిధులు మంజూరు చేయండి. ఎమ్మెల్యే: పంచాయతీ వారు స్థలం కేటాయిస్తే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా. -
నేరాలకు చెక్
ప్రజలు చెప్పిన సమస్యలు. కృష్ణానగర్, రాజ్‌విహార్, బిర్లా జంక్షన్ వద్ద మద్యం షాపుల ముందే తాగుతున్నారు. దీనిని అరికట్టాలి. చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు బీట్లు సరిగా చేయడం లేదు. ఉన్న బీటు సిబ్బంది కూడా మామూళ్ల కోసం ఇసుక ట్రాక్టర్ల వెంట పడుతున్నారు. కొత్త బస్టాండ్ వద్ద వ్యభిచారం జోరుగా సాగుతోంది. విద్యార్థులు త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్పీ హామీలు...! బీట్ల సంఖ్య పెంచి పోలీసుల గస్తీ ముమ్మరం చేస్తాం. మద్యం షాపుల ముందు తాగకుండా చర్యలు తీసుకుంటాం. చెన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నాయి. గతంలో వాహనాల మీద వచ్చి చైన్‌స్నాచింగ్‌లు చేసేవారు. కొత్తగా కాలినడకన వచ్చి చేస్తున్నారు. వీరిపై కూడా నిఘా పెట్టాం. వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తాం. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం పెంచుతాం. ప్రజల అవగాహన పెంచేలా ఇంటికో కరపత్రాన్ని పంచుతాం. వ్యభిచారాన్ని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం. ఆయన పేరు ఆకె రవికృష్ణ. కర్నూలు జిల్లా పోలీసు బాస్ ఆయన. ప్రజల శాంతి భద్రతలతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆయన ప్రత్యేకత. ఆర్డర్లీ రాజ్యమేలే పోలీసు వ్యవస్థలో తన కింద పనిచేసే సిబ్బందికి ఏదైనా ఆపద వస్తే ఆదుకునే తత్వం ఆయనది. తాజాగా ప్రమాదంలో చనిపోయిన గూడూరుకు చెందిన కానిస్టేబుల్ స్వర్ణకుమార్ ఇంటికి వెళ్లారు. తన కోసం ప్రత్యేకంగా ఏమీ వంట చేయవద్దని.. మీరు వండుకున్నదే పెట్టాలన్నారు. నేను మీ బిడ్డనే అని కానిస్టేబుల్ తల్లిదండ్రులకు ఊరటనిచ్చారు. ఇదీ ఆయనలో ఉన్న బాస్ నైజానికి ఒక కోణం కాగా... పనిచేయకుండా బద్దకిస్తే అంతేస్థాయిలో ఫైర్ అవుతూ మెమోలు ఇవ్వడం ఆయనలోని మరో కోణం. పోలీసు అంటే కేవలం శాంతి భద్రతలే కాదు.. అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను కూడా పారదోలాలనేది ఆయన నైజం. కొద్దిరోజుల క్రితం జిల్లెల, జలదుర్గం గ్రామాల్లో అంటరానితనం పారదోలేందుకు దగ్గరుండి మరీ దళితులందరికీ క్షవరం చేయించారు. అంతేకాదు.. రాత్రివేళల్లో పోలీసుస్టేషన్‌కు వెళితే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా? లేదా తెలుసుకునేందుకు ఏకంగా రాత్రిపూట కె. నాగలాపురం పోలీసుస్టేషన్‌కు సామాన్యుడిగా వెళ్లారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని కళ్లారా చూసి... ఇలాంటివి జరిగితే సహించేది లేదని పోలీస్ బాస్ అంటే ఎలా ఉండాలో చూపారు ఆకె రవికృష్ణ. ఆయనతో ఈ వారం సాక్షి ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమం.. సాక్షి వీఐపీ రిపోర్టర్ కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలులోని అవుట్డోర్ స్టేడియానికి శనివారం ఉదయం ఆరు గంటలకే వచ్చారు. స్టేడియంలో జాగింగ్ చేస్తున్న వాకర్లను జిల్లాలో పోలీసు తీరును, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఇంకా ఏం చేయాలో సలహాలు ఇవ్వాలని కోరారు. వారు చెప్పిన సమస్యలపై వెంటనే స్పందించారు. ఏం చర్యలు తీసుకుంటామో తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన చైన్ స్నాచింగ్, మందు బాబుల ఆగడాలు, వ్యభిచారం, పోలీసులు గస్తీ చేయకపోవడంపై వెంటనే స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హామీనిచ్చారు. అపార్టుమెంట్లు, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా నిఘా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇదీ వాకర్స్‌తో ఎస్పీ సాగించిన మాటామంతీ.... ఎస్పీ : నేను జిల్లా ఎస్పీ రవిక్రిష్ణ. సాక్షి తలపెట్టిన వీఐపీ రిపోర్టర్ జిల్లా పోలీసింగ్‌పై అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా మీ పేరు చెప్పండి.? వాకర్ : నా పేరు శ్రవణ్‌కుమార్, స్కంద రియల్ ఎస్టేట్ జీఎం. ఎస్పీ : పోలీసింగ్ ఎలా ఉంది? శ్రవణ్‌కుమార్ : మీరొచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది. మీరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టగానే సైకిల్‌పై తిరగడం, కాలనీల్లో పర్యటించడం, ట్రాఫిక్ కంట్రోల్‌పై దృష్టి మళ్లించడం వంటి చర్యలు చేపట్టడం వల్ల మిగతా సిబ్బంది కూడా తమ పనులపై దృష్టి పెట్టారు. ఎస్పీ : వ్యాపార సముదాయాల వద్ద భద్రత ఎలా ఉంది ? శ్రవణ్‌కుమార్ : గతంలో బ్యాంకుల వద్ద దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడేవారు. ప్రస్తుతం పోలీస్ గస్తీ ఉండటం వల్ల పర్వాలేదు. అలంకార్ , యుకాన్ ప్లాజాల వద్ద గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ : మీరు చెప్పండి. మీ పేరేంటి.? నగరంలో పోలీసుల పనితీరు ఎలా ఉంది.? వాకర్ : నా పేరు రమణ. కాలేజి పిల్లలు త్రిబుల్ రైడింగ్ పోతున్నారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అతివేగంగా వెళుతూ పక్కవాళ్లు ప్రమాదాలకు గురయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల అతివేగంపై నిఘా పెట్టాలి. ఎస్పీ : డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఎలా ఉంది ? వాకర్ : నా పేరు రాజశేఖర్. మీరు మొదలెట్టిన డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమం బాగుంది. మద్యం ప్రియులకు అడ్డుకట్ట వేసినట్లయింది. శ్రవణ్‌కుమార్ : సార్.. మరో విషయం.. ఎస్పీ : చెప్పండి .. శ్రవణ్‌కుమార్ :అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోండి. గతంలో అపార్ట్మెంట్లలో నేరాలు ఎక్కువగా జరిగాయి. తరచుగా కూడా జరుగుతున్నాయి. మీ ఆఫీస్‌కు సమీపంలోనే గతంలో అపార్ట్మెంట్లో జంట హత్యల సంఘటన కూడా చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు, వాచ్మెన్లను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే నేరాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఎస్పీ : ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు డయల్ 100కు ఎప్పుడైనా ఫోన్ చేశావా ? శ్రవణ్‌కుమార్ : ఊ.. చేస్తూనే ఉన్నాం సార్. వారొచ్చేలోగా అల్లరి మూకలు వెళ్లిపోతున్నారు. ఎస్పీ : మీ సమస్య ఏమిటి చెప్పండి. వాకర్ : నాపేరు దావూద్ ఖాన్. కొత్తపేట. మునిసిపల్ కార్యాలయం దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటాం. ఎస్పీ : మీ ప్రాంతంలో రౌడీలున్నారా ? వాకర్ : సార్.. నా పేరు శంకర్ గౌడ్. మా ప్రాంతంలో రౌడీలు ఉన్నారు. అయితే వారిలో వచ్చిన మార్పో లేక మీరు తీసుకున్న చర్యలో తెలియదు కానీ రౌడీయిజం తగ్గింది. అయినా వారిపై నిఘా ఉంచడమే మంచిదని నా అభిప్రాయం సార్. ప్రస్తుతం ప్రజలు ఇంట్లో నుంచి ధైర్యంగా బయటికి వెళ్లగలుగుతున్నారు. ఎస్పీ : నగరంలో ఏమైనా సమస్య వస్తే పోలీసులకు చెబుతున్నావా.. ఎవరికి చెబుతున్నారు ? వాకర్ : సార్.. నా పేరు సునీల్‌కుమార్. మాంటిస్సోరిలో చదువుతున్నా. ఏవైనా సంఘటనలు జరిగితే డయల్ 100కు ఫోన్ చేస్తున్నాం. క్యూఆర్టీ వాహనం కూడా కాలనీలోకి వస్తుంది సార్. ఎస్పీ : మీ పేరు చెప్పండి ? మీ కాలనీలో పోలీసులు గస్తీ తిరుగుతున్నారా ? వాకర్ : నా పేరు మధుసూదన్. మెడికల్ రెప్. అశోక్‌నగర్‌లో ఉంటున్నాం. ఎస్పీ : సమస్యలేమైనా ఉన్నాయా ? మధుసూదన్ : అశోక్‌నగర్‌లో అల్లరి మూకల సమస్య ఎక్కువగా ఉంది. పల్సర్ వాహనాలపై చక్కర్లు కొడుతూ రాత్రి వేళల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో రెండు సార్లు రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. పోలీసులు వెళ్లినప్పుడు మాత్రం అల్లరి మూకలు పరారవుతారు. పోలీసులు వెళ్లిపోగానే మళ్లీ యధా ప్రకారం వ్యవహరిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోండి. ఎస్పీ : మీ సమస్య ఏంటి ? వాకర్ : సార్.. నా పేరు శ్రీనివాసులు. ప్రభుత్వ ప్రెస్‌లో పని చేస్తున్నాను. ఎస్బీఐ కాలనీలో ఇళ్ల ముందు నిలబెట్టిన వాహనాలను చోరీ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల ముందు ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవాలంటేనే భయపడుతున్నాం. శివారు కాలనీలకు గస్తీ పోలీసులు రావడం లేదు. ఎస్పీ : పోలీసులెలా పని చేస్తున్నారు.. సమస్యలేమైనా ఉన్నాయా..? ట్రాఫిక్ సమస్యలేమైనా ఉన్నాయా ? శ్రీనివాసులు : ఎస్పీ బంగ్లా ముందు తరుచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు రాక ముందు ఎక్కువగా వుండేవి. ఇప్పుడు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం. ఆటో డ్రైవర్లపై కఠినంగా వ్యవహరిస్తేనే ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. వాకర్ : సార్.. నా పేరు రవి. మద్యం షాపుల ముందు వాహనాలు పార్క్ చేసుకుని వాటిపైనే కూర్చుని తాగుతున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు సమస్య అవుతోంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వైన్ షాప్ దగ్గర ఇలాగే జరుగుతుంది. రోడ్డుపైనే కూర్చుని తాగుతున్నారు.. కృష్ణానగర్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఎస్పీ : ఈ సమస్య డయల్ 100కు చెప్పారా..? రవి : లేదు సార్.. నేరుగా మీతోనే చెప్పాలని అనుకున్నాం. కానీ అనుకోకుండా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. దాదాపు కిలోమీటరు పొడవున వైన్ షాపుల ముందు తోపుడు బండ్లు పెట్టి చికెన్, చేపలు, గుడ్లు, మిక్సర్ అమ్ముతున్నారు. మటన్ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో తిరగాలంటేనే మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పోలీసులను పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎస్పీ : బీట్ సిస్టమ్ ఎలా ఉంది..? వాకర్ : సార్.. నా పేరు రమణారెడ్డి. రియల్టర్. పోలీసుల గస్తీ బాగానే ఉంది. కానీ గస్తీ విధుల కంటే కూడా ఇసుక ట్రాక్టర్లపైనే వారికెక్కువ నిఘా ఉంటుంది. మామూళ్ల కోసం పశువులు, బండల లారీలపై నిఘా ఉంచి మామూళ్లు దండుకుంటున్నారు. తుంగభద్ర నది నుంచి ఇసుక తీసుకెళ్లే వాహనాలను వెంబడించి మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు తప్పా శివారు కాలనీలకు వెళ్లడం లేదు. కల్లూరు ఏరియాలో ఎక్కువగా ఈ వ్యవహారం జరుగుతుంది. ఎస్పీ : నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. వాకర్ : సార్.. నా పేరు శ్రీదేవి, మాది బాలాజీ నర్సింగ్ హోమ్ దగ్గర నాగిరెడ్డి కాలనీ. చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండటంతో ఉదయం పూట వాకింగ్‌కు రావడానికి భయపడుతున్నాం. గట్టి చర్యలు తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. మీరే పోలీసులకు సూచనలు ఇచ్చి గట్టి నిఘా ఏర్పాటు చేయాలి సార్. వాకర్ : సార్.. నా పేరు సురేష్. కొత్త బస్టాండ్ ఏరియాలో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది. ఆ ప్రాంతంలో చిన్న పిల్లలు, మహిళలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వ్యభిచార కార్యక్రమాలపై నిఘా ఉంచాలి సార్.. లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. నేను ఈ విషయం చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు.. థ్యాంక్యూ సార్. ఎస్పీ : మీ పేరేంటి ? వాకర్ : అబ్దుల్లా సార్. ప్రమాదాల నివారణ కోసం మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. అక్కడక్కడ ప్రమాదాల నివారణ కోసం గోడలపై రాయించిన సూక్తులు చైతన్యపరుస్తున్నాయి. దిక్కులు చూడకు జాగ్రత్త.. అనే సూక్తులను నేను ట్రావెల్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా నడుపుతున్నాను. అయితే ఎదుటి వారు కూడా అలా వ్యవహరిస్తే బావుంటుంది. ఇతర వాహనాలు వచ్చి కొట్టేస్తున్నాయి. ఇద్దరు పల్సర్ బైక్‌పై వస్తున్నారు. వెనుక నుంచి వచ్చి కొట్టారు. బండి నంబర్ కూడా చూసుకోలేదు. ట్రాఫిక్‌పై మరింత చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్.