వికా సాగర్ జేవీలో పూర్తివాటా వికా చేతికి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కర్నాటక రాష్ర్టం గుల్బర్గాలో ఏర్పాటు చేసిన వికా సాగర్ సిమెంట్‌లో 47 శాతం వాటాను వికాకు విక్రయిస్తోంది. 47 శాతం వాటాను రూ. 435 కోట్లకు (షేరు ధర రూ.66.68) అమ్మడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు సాగర్ సిమెంట్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు వికా, రాష్ట్రానికి చెందిన సాగర్ సిమెంట్స్ సంయుక్త భాగస్వామ్యంతో గుల్బర్గాలో వికా సాగర్ సిమెంట్ పేరుతో 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని 2008లో నిర్ణయించుకున్నాయి. ఈ వెంచర్లో వికాకు 53 శాతం వాటా వుంది.
ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద డిసెంబర్, 2012 నాటికి 2.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం సాగర్ సిమెంట్ రూ.86 కోట్లు వ్యయం చేసింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా భాగస్వామ్యం నుంచి తప్పుకున్నామని, ఇక నుంచి రెండు కంపెనీలు వాటి శక్తి సామర్థ్యాలున్న రంగాలపై పూర్తి దృష్టిసారించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని సాగర్ సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ప్లాంట్ పెట్టడం లేదా ఇతర కంపెనీలను కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాగర్ సిమెంట్స్ 2.3 మిలియన్ టన్నుల క్లింకర్ సామర్థ్యం, 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవసరమైన నియంత్రణా సంస్థల అనుమతులు రాగానే డీల్ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది.