చాక్లెట్ కేక్ తింటే ఊపిరి ఆగింది!
సిడ్నీ: చాక్లెట్ కేక్ తిన్న ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. మీరు నమ్మకున్నా ఇది నిజం. గతవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన పదేళ్ల బాలుడు విక్టర్ లీ ఓ చాక్లెట్ కేక్ తిన్నాడు. అయితే అనుకోకుండా విక్టర్ అనాఫిలాక్టిక్ అనే షాక్ కు గురయ్యాడు. విక్టర్ కు ఏమైందో అర్థంకాని తల్లిదండ్రులు డాక్టర్లను సంప్రదించారు. విక్టర్ కు చిన్న ఎలర్జీ సమస్య ఉందని ఆ కారణం చేత అనారోగ్యానికి గురయ్యాడని వారు తెలిపారు. కొన్ని రకాల గింజలు, ఇతర ఆహార పదార్థాలు తింటే అస్తమా వచ్చే అవకావం ఉందని విక్టర్ తల్లితండ్రులకు డాక్టర్లు వివరించారు.
మరో వారం రోజుల్లో కుమారుడి 11వ పుట్టినరోజు జరపాలని ఆ తల్లిదండ్రులు ముచ్చటపడ్డారు. కానీ వారి కోరిక తీరలేదు. కొన్నిరోజుల పాటు అనారోగ్యంతో బాధపడ్డ ఆ విక్టర్ చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడికి ఉన్న అస్తమా కారణాల వల్ల శ్వాసనాళాలు పూర్తిగా మూసుకుపోవడం బాలుడి మృతికి దారితీసిందని వైద్యులు నిర్ధారించారు. చిన్న అలర్జీ కారణంగా తమ కుమారుడు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక పోయిన ఆ తల్లిదండ్రులు ఓ ఫౌండేషన్ స్థాపించారు. అలర్జీ గురించి పరిశోధన చేయడానికి విరాళాలు సేకరణ కోసం తాము ఈ పని చేసినట్లు విక్టర్ పేరేంట్స్ చెప్పుకొచ్చారు.
చాలా చురుకైన విద్యార్థి
నార్త్ బ్రిడ్జ్ పబ్లిక్ స్కూల్ తరఫున అతిపిన్న వయసులో చెస్ ఛాంపియన్ గా నిలిచాడు విక్టర్. చెస్ మాత్రమే కాదు ఫుట్ బాల్ కూడా బాగా ఆడతాడని స్కూలు యాజమాన్యం అతడి మృతిపట్ల దిగ్భ్రాంతి చెందింది. చదువులోనూ ఎప్పుడు ముందుండే వాడని, ముఖ్యంగా చెస్ లో చాలా టోర్నమెంట్లలో విజయాలు సాధించాడని గుర్తుచేసుకున్నారు. మ్యాథమేటిక్స్ లో తరగతిలో ఇతర విద్యార్థుల కంటే చాలా వేగంగా చేసేవాడని అతని టీచర్లు వివరించారు.