'పోలీసులా? లేక మీ ప్రైవేటు సైన్యమా?'
న్యూఢిల్లీ: వేముల రోహిత్ ఆత్మహత్యపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అమానుషంగా దాడి చేసిన వీడియో వెలుగుచూడటంతో హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. తన ప్రత్యర్థులను టార్గెట్ చేసుకోవడానికి బీజేపీ ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటున్నదని మండిపడ్డారు. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి- ఢిల్లీ సర్కారుకు ఘర్షణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
రెండురోజుల కిందట ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు, విద్యార్థినులపై కొందరు పోలీసులు, సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు దాడి చేసిన వీడియో వెలుగుచూడటం సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందిస్తూ ' బీజేపీ/ఆరెస్సెస్ ను వ్యతిరేకించే వారిని భయభ్రాంతులకు గురిచేసి.. వారికి గుణపాఠం చెప్పేందుకు బీజేపీ/ఆరెస్సెస్ ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటున్నాయి. విద్యార్థులపై జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు బీజేపీకి ప్రైవేటు సైన్యంగా మారిపోయారని ధ్వజమెత్తారు. రోహిత్ ఆత్మహత్య, ఎఫ్ టీఐఐ, ఐఐటీల్లో నిరసనలను బట్టి చూస్తే దేశమంతటా విద్యార్థులతో మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోందా? అన్న భావన కలుగుతోందని అన్నారు. మరోవైపు విద్యార్థులపై వీడియో నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించి ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసింది.