ఎలక్షన్.. కలెక్షన్
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు ఎన్నికల దరువు..
మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లకు ముగియనున్న గడువు..
ప్రస్తుతం ఈ రెండు బాధ్యతల్లో జీహెచ్ఎంసీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనుండటంతో జీహెచ్ఎంసీలోని ఎన్నికల విభాగం సిబ్బంది ఓటరు దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నం కాగా, ఇతర విభాగాల అధికారులు పోలింగ్ కేంద్రాల పరిశీలన, అవసరమైన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల మరమ్మతులు, కేంద్రం మార్పు పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇందుకు ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లోని వారిని విని యోగించారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన నోడల్, వీడియో సర్వైలెన్స్, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ బృందాల్లోని సభ్యు లు తమ బాధ్యతల నిర్వహణపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పరి దిలో నిర్వహించాల్సిన విధులపై నియోజకవర్గాల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పార్టీల హోర్డిం గ్లు, బ్యానర్లు, పోస్టర్లు తదితరమైన వాటిని తొలగించే పనుల్లో మరికొందరున్నారు.
వసూళ్లు ముమ్మరం..
ఎన్నికల విధుల్లోని అధికారులు మినహా మిగతా అన్ని విభాగాల్లోని వారిని ఆస్తిపన్ను వసూళ్లలో నిమగ్నం చేశారు. ఏరోజుకారోజు టార్గెట్లతోపాటు వారిని క్షేత్రస్థాయి విధుల్లో నియమించారు. ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఆరోగ్యం- పారిశుధ్యం విభాగాల్లోని వారందరూ ఈ పనుల్లో మునిగారు. మరోవైపు కాల్‌సెంటర్ ద్వారా ఆస్తిపన్ను బకాయిదారులకు ఫోన్లు చేస్తున్నారు. నెలాఖరు వరకు మాత్రమే జరిమానా లేకుండా ఆస్తిపన్ను చెల్లించేందుకు గడువుండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్నందున లక్ష్యసాధనకూ ఈ విభాగంపైనే అధిక దృష్టి కేంద్రీకరించారు.