ప్రజల సహకారంతోనే ఆరోగ్యాంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారాలంటే ప్రజల సహకారం అవసరమని, వైద్య విద్యార్థుల కృషి కూడా కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ప్రత్యేకంగా స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు సందర్శించిన విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు వేయాల్సిందిగా ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉప కులపతిని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు 446 బృందాలుగా ఏర్పడి జనవరి రెండు నుంచి డిసెంబర్ చివరి వరకూ పరిసరాలు..వ్యక్తిగత పరిశుభ్రత, అంటు వ్యాధులు, రక్తహీనత, పునరుత్పత్తి ఆరోగ్యం, సమీకృత ఆహారం, వ్యాయామ అక్షరాస్యత, దీర్ఘకాలిక వ్యాధులు, వ్యసనాల వంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని చెప్పారు.