రూ.150 కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం
కణేకల్లు : కణేకల్లు మండలంలో రూ.150 కోట్లతో 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో కన్‌స్ట్రక‌్షషన్ ఈఈ ఎన్.ఆనంద్ తెలిపారు. శుక్రవారం కణేకల్లుకు వచ్చిన ఆయన ఏడీ రామాంజనేయులతో కలిసి స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కణేకల్లు మండలంలో గాలిమరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో ఈ విద్యుత్‌ను సేకరించేందుకు 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గాలిమరల విద్యుత్ తీసుకోవడంతో పాటు అవసరమైతే ఇళ్లు, వ్యవసాయ రంగానికి అవుట్‌పుట్ కూడా ఇస్తామన్నారు.
ఈ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాల భూమి అవసరముందని, దీని కోసం స్థల సేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్.హనుమాపురం, సొల్లాపురం, మాల్యం గ్రామం వద్ద 100 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. భూసేకరణ ప్రక్రీయ పూర్తి అయితే మార్కెట్ విలువ ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉరవకొండ మండలం మోపిడి వద్ద 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఉందని ఆయన వివరించారు. సోమందేపల్లి, తాడిపత్రి సమీపంలోని తలారి చెరువు వద్ద కూడా ఇలాంటి సబ్‌స్టేషన్ నిర్మాణదశలో ఉందన్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇలాంటిదే నాల్గో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.