అన్నదాతల ఆందోళన
బోనకల్, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే దిక్కుతోచని అన్నదాత లు రోడ్డెక్కారు. సాగు నీరందించాలంటూ వైరా- జగ్గయ్యపేట జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. అయితే అదో పెద్ద నేరంగా భావించిన పోలీసులు.. రైతులను అరెస్ట్ చేసి వారిపై లాఠీలు ఝుళిపించారు. వివరాలిలా ఉన్నాయి.. నాగార్జునసాగర్ కాల్వ పరిధిలోని రాపల్లి మేజర్ కింద వైరా మండ లం అష్టగుర్తి, పాలడుగు, బోనకల్ మండలం సీతానగరం, రాపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాలకు చెందిన రైతుల పొలాలు సాగ వుతున్నాయి.
ఖరీఫ్‌లో వరి, పత్తి సాగు చేయగా, అకాల వర్షాలతో భారీగా నష్టపోయారు. సాగర్ నిండా నీరున్నప్పటికీ రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని అధికారులు చెప్పడంతో మొక్కజొన్న, మిను ము, బొబ్బెర తదితర పంటలు వేశారు. వారబందీ విధానంతో నెలలో రెండు వారాలు నీరు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, 15 రోజులు దాటినా.. సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయి. బీబీసీకి 1300 క్యూసెక్కులకు గాను, 800-900 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండటంతో చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి.
ఈ విషయాన్ని ఎన్నెస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతు లు రాస్తారోకోకు దిగారు. అధికారులు వచ్చి తమకు సరైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ తాండ్ర నరేష్ అక్కడికి చేరుకుని, 20 మంది రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రైతులపై జులుం..
రాస్తారోకో చేస్తున్న రైతులపై ఎస్ఐ నరేష్ జులుం ప్రదర్శించారు. కాల్వ వద్దకు వెళ్దామంటూ వారిని ఆటో ఎక్కించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ రైతులను వరుసక్రమంలో నిల్చోబెట్టి లాఠీకి పనిచెప్పారు. దీంతో రైతులు నివ్వెర పొయారు. సాగునీటి కోసం వస్తే తమకీ శిక్ష ఏంటని నిశ్చేష్టులయ్యారు. జానకీపురం గ్రామ సర్పంచ్ భర్త మాలెంపాటి రామకృష్ణను ముందుగా పిలిచి చితకబాదారు.
రైతు సంఘాల ఆగ్రహం..
రైతుల అరెస్ట్ విషయం తెలియగానే పలు రైతు సంఘాలు, పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, సాగునీటి కోసం రాస్తారోకో చేసిన వారిపై చేయిచేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ వారి ముందే మరోసారి రైతులపై జులుం ్రపదర్శించారు. దీంతో రైతులు, నాయకులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. అనంతరం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పోలీసుల వైఖరిని అఖిల పక్షనాయకులు పైడిపల్లి కి షోర్, తమ్మారపు వెంకటేశ్వర్లు, గాలి దుర్గారావు, బొడేపూడి చందు, చిలక వెంకటేశ్వర్లు, జంగం ఆర్లప్ప, తన్నీరు రవి, చింత లచెర్వు కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, చావా హనుమంతరావు, మందడపు తిరుమలరావు తదితరులు తీవ్రంగా ఖండించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.