Vietnam Open Grand Prix badminton tournament
-
Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్–లక్ష్మి ప్రియాంక (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్ సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన రెండో సీడ్ సాయిప్రణీత్ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్ సతీశ్ కుమార్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్ మేకల కిరణ్ కుమార్ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో కిరణ్ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్ శుభాంకర్ డే (భారత్)పై నెగ్గి...రెండో రౌండ్లో 16–21, 21–14, 21–19తో ఫోన్ ప్యా నైంగ్ (మయాన్మార్)ను ఓడించాడు. -
టైటిల్‌కు విజయం దూరంలో...
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ మరో అడుగు ముందుకేశాడు. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 93వ ర్యాంకర్ జయరామ్ 21–14, 21–19తో 49వ ర్యాంకర్, ఏడో సీడ్ యు ఇగారషి (జపాన్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్ రుస్తవిటో (ఇండోనేసియా)తో జయరామ్ తలపడతాడు. మరో సెమీ ఫైనల్లో రుస్తవిటో 21–17, 19–21, 21–14తో భారత్‌కు చెందిన మిథున్‌ను ఓడించాడు. ఏడాది క్రితం 13 ర్యాంక్‌లో నిలిచిన జయరామ్ ఆ తర్వాత గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఫలితంగా అతని ర్యాంక్ పడిపోయింది. ఈ సంవత్సరం ఆరంభంలో పునరాగమనం చేసిన జయరామ్ ఎనిమిది టోర్నీలు ఆడాడు. వైట్ నైట్స్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించాడు. -
వియత్నాం ఓపెన్ టోర్నీ సెమీస్‌లో అజయ్ జయరామ్
తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జయరామ్‌తోపాటు భారత్‌కే చెందిన మరో యువ ఆటగాడు మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో జయరామ్ 26–24, 21–17తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై గెలుపొందగా... మిథున్ 17–21, 21–19, 21–11తో జెకి జౌ (చైనా)ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో ఓడిన రుత్విక
హో చి మిన్ (వియత్నాం): వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని 21–18, 15–21, 8–21తో దినర్ అయుస్టీన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లోనూ లక్ష్యసేన్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. జపాన్‌కు చెందిన కొడై నరోఓకా 21–17, 21–23, 21–10తో లక్ష్యసేన్‌పై గెలిచాడు. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన అర్జున్– శ్లోక్ ద్వయం సెమీస్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో రుత్విక
సాక్షి, హైదరాబాద్: వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయిలు గద్దె రుత్విక శివాని, గుమ్మడి వృశాలిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రుత్విక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... వృశాలి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుత్విక 21–15, 21–12తో వాన్ యి తాంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. వృశాలి 8–21, 21–12, 10–21తో ఆరో సీడ్ చెన్ సు యు (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. భారత్‌కే చెందిన శ్రేయాన్షి పరదేశి 6–21, 21–16, 21–23తో మూడో సీడ్ దినార్ అయుస్టిన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–14, 21–12తో త్రుయోంగ్ తన్ లాంగ్ (వియత్నాం)పై గెలుపొందాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో దినార్‌తో రుత్విక శివాని; కొడాయ్ నరావుకా (జపాన్)తో లక్ష్య సేన్ తలపడతారు.