అతడితో మాకు ఓకే అంటున్న నయన్, త్రిష
విజయ్ సేతుపతిని ఫ్లాప్ల నుంచి బయటపడేసిన చిత్రం నానుమ్ రౌడీదాన్. అందులో హీరోయిన్ నయనతార. ఆ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివ. అతడికి ఈ చిత్రంలో పరిచయమే నయనతారతో ప్రేమకు దారి తీసిందనే ప్రచారం హల్చల్ చేసింది. మొత్తం మీద నానుమ్ రౌడీదాన్ చిత్రం చాలా మార్పులకు కారణంగా నిలిచిందని చెప్పాలి.
నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత సేతుపతి, కాదలుమ్ కడందుపోగుమ్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రెక్క చిత్రంలో నటిస్తున్న ఈ హీరో కోసం పలు అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. నానుమ్ రౌడీదాన్ చిత్రం తరువాత దర్శకుడు విఘ్నేష్ శివ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోగా మళ్లీ విజయ్సేతుపతినే ఎంచుకున్నారు. ఇక ఇందులో ఇద్దరు నాయికలు అవసరం కావడంతో తన ప్రేమికురాలిగా ప్రచారంలో ఉన్న నయనతారను ఒక నాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇకపోతే మరో నాయకిగా నయనతార స్నేహితురాలు త్రిషను నటింపచేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన నటి త్రిష తననెవరూ సంప్రదించలేదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా త్రిష, నయనతారతో కలసి విఘ్నేష్ శివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాత్తువాక్కుల రెండు కాదల్ అనే పేరును నిర్ణయించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం తన శ్రీసాయిరామ్ ఫిలింస్ పతాకంపై భారీ ఎత్తున్న నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఇద్దరు టాప్ హీరోయిన్లతో ఒకే చిత్రంలో నటించే అవకాశం రావడంతో విజయ్ సేతుపతి యమ ఖుషీ అయిపోతున్నారట.