నెలకు రెండు ఇంజెక్షన్లతో హెచ్ఐవీకి చెక్!
హెచ్ఐవీ వ్యాధి నియంత్రణ దిశగా కీలక అడుగు పడింది. సుదీర్ఘకాలం క్రియాశీలంగా ఉండే రెండు ఇంజెక్ట్బుల్ ఔషధాలను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి రోగికి ఇవ్వడం వల్ల హెచ్ఐవీకి నిరవధికంగా చెక్ పెట్టవచ్చునని ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది. హెచ్ఐవీ నిరోధానికి జాన్సన్ అండ్ జాన్సన్, దాని భాగస్వామ్య సంస్థ వీఐఐవీ కలిసి చేపడుతున్న ప్రాథమిక పరీక్షా ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ కంపెనీలు చేపడుతున్న మొత్తం 96 వారాల అధ్యయనంలో భాగంగా మొదటి 32 వారాల అధ్యయన ఫలితాలను మంగళవారం ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు చేరో ఔషధంతో హెచ్ఐవీ నిరోధానికి ఈ పరిశోధన నిర్వహిస్తున్నాయి. హెచ్ఐవీ వ్యాధి నిరోధక ఔషధాలు అందించడంలో వీఐఐవీ పేరెన్నికగన్న సంస్థ.
ఈ ప్రయోగానికి సంబంధించి కీలకమైన అదనపు పరీక్షలు ఇంకా జరుగాల్సింది. అయితే, ఈ ఔషధ కలయిక చికిత్సకు ఆమోదం లభిస్తే.. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధి నిరోధంలో గణనీయమైన ముందడుగు పడినట్టే. పరిశోధనలో భాగంగా 309 హెచ్ఐవీ మంది రోగులపై పరీక్షలు నిర్వహించారు. రక్తంలో హెఐవీ వైరస్ను నిరోధించేందుకు రోజువారీ ఔషధ మాత్రలను వీరు గతంలో తీసుకునేవారు. వీరికి ప్రయోగదశలో ఉన్న ఇంజెక్షన్లు ఇవ్వగా.. దాదాపు 95శాతం మంది రక్తంలోని హెచ్ఐవీ వైరస్ను 32 వారాలపాటు నియంత్రించింది. ఔషధమాత్రలు తీసుకునేవారు 91శాతం మందిలో మాత్రమే హెచ్ఐవీ నియంత్రణ సాధ్యపడింది. మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకునే రెండు గ్రూపుల రోగులకు చికిత్స కొనసాగిస్తూ.. కాలనుగుణంగా వారి రక్తాన్ని పరీక్షిస్తున్నారు. ఈ అధ్యయన నివేదికలను పరిశీలిస్తే.. రానున్నకాలంలో కొత్త విధానమే ఆచరణసాధ్యంగా కనిపిస్తున్నదని హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన ఎయిడ్స్ చికిత్స నిపుణుడు డాక్టర్ డానియెల్ కురిట్జ్కెస్ తెలిపారు.