Vijai Sardesai
-
గోవాకు వచ్చే వాళ్లంతా పనికిమాలినోళ్లే!
పనాజి : గోవాకి వచ్చే పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారేనని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్ర జనాభా కన్నా.. ఇక్కడికి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు అధికంగా ఉందని, వీళ్లంతా గొప్ప వాళ్లేం కాదన్నారు. గోవాలో ప్రస్తుత సమస్యలకు ఉత్తరాది రాష్ట్రాలే కారణమంటూ.. అక్కడి వారు గోవాను మరో హర్యానాలా మార్చాలనుకుంటున్నారని తెలిపారు. కొన్ని రోజులు సేదతీరడానికి వచ్చే వీళ్లకి.. ఎలా అవగాహన కల్పించేదని ప్రశ్నించారు. ఆదాయం, సామాజిక, రాజకీయ అవగాహన, ఆరోగ్యం విషయంలో.. దేశంలో అందరికన్నా గోవా ప్రజలు ముందున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా మా గోవా వాళ్లు ఉన్నతులని సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది వారికి వ్యతిరేకం కాదు.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి సర్దేశాయ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదని, దేశీయ పర్యాటకులందరినీ పనికిమాలినవారని అనలేదని.. కొన్ని వర్గాల వల్ల మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయని మాత్రమే తెలిపానన్నారు. తనవి విద్వేషపూరిత వ్యాఖ్యలు కాదని.. కేవలం గోవా ప్రజల మనోగతాన్ని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు. -
ఆ అనుమానాలను నివృత్తి చేయాలి
పనాజి: పశు వధపై కేంద్రం ఇటీవల చేసిన చట్టంపై గోవా ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలతో లేఖ రాయనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి విజయ్ సర్దేశాయ్ విలేకరులకు తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయని, దీనిపై తాను సీఎం పారికర్తో చర్చించగా కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చెప్పారన్నారు. ఈ చట్టం వల్ల కేంద్రం ప్రతి ఒక్కరిని శాఖాహారం వైపు మళ్లించనున్నదని ప్రజల్లో అపోహలున్నాయని, గోవాలో మెజారిటీ ప్రజలు ఎద్దు మాంసం తింటారని, అలాంటి వారి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సంబంధిత కేంద్ర మంత్రి గోవా సీఎం పారికర్తో మాట్లాడి ఈ చట్టంపై అభ్యంతరాలు తెలుపాల్సిందిగా కోరారని సర్దేశాయ్ తెలిపారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేలా చట్టంలో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ తరపున తాము సీఎంను కలిశామని, గోవా కేంద్ర చట్టం పరిధిలోకి రాదని, అయితే అంతర్రాష్ట్ర సంబంధాల రీత్యా గోవాపై ప్రభావం పడనుందని చెప్పారు. -
గోవా మంత్రిపై కాంగ్రెస్ ప్రశంసలు
పణజి: బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వంలో మంత్రి కొనసాగుతున్న విజయ్ సర్దేశాయ్ పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ)కు ఆయన వార్నింగ్ ఇవ్వడాన్ని స్వాగతించింది. తమ సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వీహెచ్పీ నాయకులకు ముకుతాడు వేసేందుకు వెనుకాడబోమని సర్దేశాయ్ హెచ్చరించడం సాహసోపేతమైన చర్యగా గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ట్రాజానో డీమెల్లో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కోరుకునే వారంతా సర్దేశాయ్ ను అభినందించాలని, ఆయన హెచ్చరికలకు మద్దతు తెలపాలని కోరారు. అలజడులకు కారణమవుతున్న వీహెచ్పీ లాంటి సంస్థలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెనుకాడరాదని సూచించారు. గోవాలో వచ్చే రెండేళ్లలో బీఫ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించకుంటే తామే బాన్ చేస్తామని వీహెచ్పీ నేత రాధాకృష్ణ మనోహరి ఆదివారం ప్రకటించారు. దీనిపై సర్దేశాయ్ స్పందిస్తూ... వీహెచ్పీ నేతలు తమ తీరు మార్చుకోకుంటే శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గోవాలో అడుగుపెట్టకుండా ముతాలిక్ పై గతంలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.