ఆ అనుమానాలను నివృత్తి చేయాలి
పనాజి: పశు వధపై కేంద్రం ఇటీవల చేసిన చట్టంపై గోవా ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలతో లేఖ రాయనున్నట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి విజయ్ సర్దేశాయ్ విలేకరులకు తెలిపారు. ఈ చట్టంపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయని, దీనిపై తాను సీఎం పారికర్‌తో చర్చించగా కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చెప్పారన్నారు.
ఈ చట్టం వల్ల కేంద్రం ప్రతి ఒక్కరిని శాఖాహారం వైపు మళ్లించనున్నదని ప్రజల్లో అపోహలున్నాయని, గోవాలో మెజారిటీ ప్రజలు ఎద్దు మాంసం తింటారని, అలాంటి వారి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సంబంధిత కేంద్ర మంత్రి గోవా సీఎం పారికర్‌తో మాట్లాడి ఈ చట్టంపై అభ్యంతరాలు తెలుపాల్సిందిగా కోరారని సర్దేశాయ్ తెలిపారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేలా చట్టంలో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారన్నారు. గోవా ఫార్వర్డ్ పార్టీ తరపున తాము సీఎంను కలిశామని, గోవా కేంద్ర చట్టం పరిధిలోకి రాదని, అయితే అంతర్రాష్ట్ర సంబంధాల రీత్యా గోవాపై ప్రభావం పడనుందని చెప్పారు.