గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్ (ఫైల్ ఫొటో)
పనాజి : గోవాకి వచ్చే పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారేనని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రాష్ట్ర జనాభా కన్నా.. ఇక్కడికి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు అధికంగా ఉందని, వీళ్లంతా గొప్ప వాళ్లేం కాదన్నారు.
గోవాలో ప్రస్తుత సమస్యలకు ఉత్తరాది రాష్ట్రాలే కారణమంటూ.. అక్కడి వారు గోవాను మరో హర్యానాలా మార్చాలనుకుంటున్నారని తెలిపారు. కొన్ని రోజులు సేదతీరడానికి వచ్చే వీళ్లకి.. ఎలా అవగాహన కల్పించేదని ప్రశ్నించారు. ఆదాయం, సామాజిక, రాజకీయ అవగాహన, ఆరోగ్యం విషయంలో.. దేశంలో అందరికన్నా గోవా ప్రజలు ముందున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకన్నా మా గోవా వాళ్లు ఉన్నతులని సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాది వారికి వ్యతిరేకం కాదు..
ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి సర్దేశాయ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదని, దేశీయ పర్యాటకులందరినీ పనికిమాలినవారని అనలేదని.. కొన్ని వర్గాల వల్ల మాత్రం సమస్యలు తలెత్తుతున్నాయని మాత్రమే తెలిపానన్నారు. తనవి విద్వేషపూరిత వ్యాఖ్యలు కాదని.. కేవలం గోవా ప్రజల మనోగతాన్ని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment