vijay hazare tourny
-
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
కరణ్వీర్ కౌశల్ డబుల్ సెంచరీ
నదియాడ్ (గుజరాత్): పాతికేళ్ల దేశవాళీ వన్డే టోర్నీ చరిత్రలో తొలి ద్విశతకం నమోదైంది. ఉత్తరాఖండ్ ఓపెనర్ కరణ్వీర్ కౌశల్ (135 బంతుల్లో 202; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే వన్డే టోర్నీలో సిక్కింపై ఉత్తరాఖండ్ 199 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరణ్వీర్ అద్భుత ఇన్నింగ్స్‌తో గతంలో అజింక్య రహానే (187, 2007–08) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు తెరమరుగైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 366 పరుగుల భారీ స్కోరు చేసింది. కరణ్‌వీర్‌తో పాటు మరో ఓపెనర్ వినీత్ సక్సేనా (100; 4 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 296 పరుగులు జతచేశారు. భారత లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇదే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం మరో విశేషం. గతంలో ఈ రికార్డు ధావన్–ఆకాశ్ చోప్రా (277 పరుగుల, 2007–08) పేరిట ఉంది. అనంతరం సిక్కిం 50 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. -
విజయ్ హజారే టోర్నీకి హైదరాబాద్ జట్టు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రంజీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో తలపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ... ఎస్. బద్రీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఎ. లలిత్ మోహన్, పి. సాకేత్ సాయిరాం, రోహన్ యాదవ్, ప్రిన్స్, టి. రవితేజ, బి. యతిన్ రెడ్డిలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ఈ జట్టుకు భరత్ అరుణ్ కోచ్‌గా ఎంపికవగా... జాకీర్ హుస్సేన్ అసిస్టెంట్ కోచ్‌గా, సి. దయానంద్ ఫీల్డింగ్ కోచ్‌గా, ప్రశాంత్ ఫిజియోగా వ్యవహరిస్తారు. కోల్‌కతాలో ఈనెల 25 నుంచి మార్చి 6 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది. జట్టు వివరాలు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఆకాశ్ భండారి, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, హిమాలయ్ అగర్వాల్, ముదస్సిర్ హుస్సేన్, కె. రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, శరద్ ముదిరాజ్.