Vijay Kanakamedala
-
అందుకే రూట్ మార్చాను
‘‘నరేశ్ చేసే కామెడీ సినిమాలు చాలా బాగుంటాయి అంటారు కానీ, కామెడీ సినిమాలో నరేశ్ బాగా చేశాడని ఎవరూ చెప్పరు. ‘నేను, గమ్యం, శంభో శివ శంభో, మహర్షి’ సినిమాల్లో నరేశ్‌లో ఓ నటుణ్ణి గుర్తించారు. నరేశ్ కామెడీ ఒక్కటే కాదు అన్ని పాత్రలు చేయగలడని పేరు తెచ్చుకోవాలని ఉంది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘మీ కామెడీ డ్రై అయిపోతోంది.. కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయండి’ అని కొందరు నాతో చెప్పారు.. అందుకే రూట్ మార్చాను. మలయాళ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ‘నాంది’ అలాగే ఉంటుంది. నా వద్దకు వచ్చే పది మంది దర్శక–నిర్మాతల్లో తొమ్మిది మంది కామెడీ కథలతోనే వస్తున్నారు. నాతో ప్రయోగాత్మక సినిమాలు చేయండని వారికి చెప్పలేను కదా! ‘నాంది’ కథని దర్శక–నిర్మాతలు నమ్మారు. ఈ సినిమా హిట్ అయితే నా నుంచి మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు వస్తాయి. ‘ఎవడిగోల వాడిది’లాంటి కథ విన్నాను. అంత మంది ఆర్టిస్టులతో కరెక్టుగా తెరకెక్కించే డైరెక్టర్ కావాలి. పాత్ర నచ్చితే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి రెడీ. ఈ విషయంలో నాకు విజయ్ సేతుపతిగారే స్ఫూర్తి. ఎన్ని సినిమాలు చేశామన్నది కాకుండా ఎన్ని హిట్ సినిమాలు చేశామన్నదానిపైనే ప్రస్తుతం దృష్టి పెట్టాను’’ అన్నారు. -
అదే నా బలం: విజయ్ కనకమేడల
‘‘ఒక మనిషి తప్పు చేశాడో? లేదో? తెలియకుండానే ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉంటాడు. బయటికొచ్చాక సమాజం అతన్ని విలన్ గా చూస్తుంటుంది. అప్పుడు ఏం చేశాడు? అనేదే ‘నాంది’ సినిమా’’ అని దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నాంది’. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. విజయ్ కనకమేడల మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. నవదీప్ ‘మొదటి సినిమా’ చేస్తున్నప్పుడు హరీష్ శంకర్‌గారు పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆయన ఘోస్ట్ రైటర్. అక్కడి నుంచి మా ప్రయాణం ప్రారంభమై ‘డీజే’ వరకూ కొనసాగింది. ‘మహర్షి’ చూశాక ‘నాంది’లో నరేశ్‌గారు చేస్తేనే బాగుంటుందనిపించింది. కథ వినగానే ఆయన ఒప్పుకున్నారు. ఓ సీన్లో న్యూడ్‌గా నటించారు. ‘మా నాన్నగారి (ఈవీవీ సత్యనారాయణ) తర్వాత అంత కంఫర్టబుల్‌గా ఫీలయింది మీతోనే’ అని నరేశ్‌గారు అనడం సంతోషంగా అనిపించింది. సేఫ్ జోన్ లో చాలా కథలు రెడీ చేసుకుని నిర్మాతలను కలిశాను.. కానీ కుదరలేదు. ‘నాంది’ కథ విని, సతీష్‌గారు ఓ మంచి సినిమాతో నిర్మాతగా మారుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భావోద్వేగంతో కూడిన కథలే నా బలం.. అలాంటి సినిమాలే తీస్తాను. నా తర్వాతి సినిమా కూడా నరేశ్గారితోనే ఉంటుంది’’ అన్నారు.