చేసి చూపుతాం
సాక్షి, న్యూఢిల్లీ: మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని బీజేపీ స్పష్టంచేసింది. ఈ విషయమై ఆ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘మేనిఫెస్టోలో పేర్కొన్నవిధంగా 30 రోజుల్లో ధరలు తగ్గించి చూపుతాం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు’అని పేర్కొన్నారు. కాగా నెల రోజుల్లోగా ధరలను కిందికి తీసుకొస్తామంటూ బీజేపీ నాయకత్వం మంగళవారం విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంగతి విదితమే. అయితే బీజేపీ హామీలు ఆచరణ సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ విమర్శించడంపై గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ధరలను దించి చూపుతామన్నారు. ‘ధరల నియంత్రణపై మేము పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌కి నమ్మశక్యంగా లేదట. ఆ హామీని తప్పక నిలబెట్టుకుంటాం’ అని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులను 30 శాతం వరకు ఏవిధంగా తగ్గించబోతున్నామనే విషయాన్ని ఇదివరకే వివరించామన్నారు. విద్యుత్ డిస్కంల మధ్య పోటీ పెంచడంతోపాటు వాటి పనితీరులో పారదర్శకతను పెంచుతామన్నారు.
15 నెలలు చాలు...
కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో చేయలేకపోయిన పనులను 15 నెలల్లో చేసి చూపుతామని గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, మహిళల భద్రత, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపు తదితర అంశాలను తమ పార్టీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని పునరుద్ఘాటించారు. ఈ ఏడాది నగరంలో రోజుకు ఐదు అత్యాచార కేసులు, 10 లైంగిక వేధింపులు, పది అపహరణ కేసులు నమోదయ్యాయన్నారు. పూర్తి రాష్ర్ట హోదాతో శాం తిభద్రతలను మరింత మెరుగుపరుస్తామన్నారు.
అందరి మద్దతుతో గెలుస్తా:అజయ్‌కుమార్ మల్హోత్రా
నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారి మద్దతుతో తప్పక గెలుస్తానని గ్రేటర్‌కైలాశ్ అసెంబ్లీ నియోజకవర్గం, బీజేపీ అభ్యర్థి అజయ్‌కుమార్ మల్హోత్రా అన్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న పంజాబీలతోపాటు జాట్, గుజ్జర్లు, బెంగాళీ, బ్రాహ్మణ, వాల్మీకీ సమాజాలకు చెందిన వారి మద్దతు లభిస్తోందన్నారు. వరుస సమావేశాలతోపాటు పాదయాత్రలు, బహిరంగ సభలతో స్థానిక ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు అజయ్మల్హోత్రా. ఢిల్లీ విధానసభ ప్రతిపక్షనేత, తన తండ్రి విజయ్‌కుమార్ మల్హోత్రాకు స్థానికంగా ఉన్న పట్టు తనకు విజయాన్ని సాధించి పెడుతుందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే పార్కుల్లో పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేస్తాని హామీ ఇచ్చారు.