స్నేహితుడే ప్రధాన నిందితుడు!
► ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు
► విజయ్ హత్య కేసులో నలుగురికి రిమాండ్
► 5రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
మహబూబ్‌నగర్ క్రైం : ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన మనస్పర్థలతో ఓ యువకుడిని స్నేహితుడే తుదముట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య కేసులో ఎట్టకేలకు నలుగురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను శనివారం ఇక్కడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కృష్ణమూర్తి వెల్లడించారు. కొయిలకోండ మండలం కేశ వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజునాయక్తండాలోని ఇస్లావత్ విజయ్‌కుమార్ (35), మహబూబ్‌నగర్ పట్టణం షాషాబ్‌గుట్టకు చెందిన చెన్నంగారి మహేష్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకేచోట చదువుకున్నారు.
ఈ క్రమంలోనే కొన్నేళ్ల నుంచి జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లక్రితం మద్దూర్‌లో ఐదున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి ప్లాట్లు వేశారు. రెండేళ్లక్రితం ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు రావడంతో గొడవపడి విడిపోయారు.
అనంతరం విజయ్‌కుమార్ ఆ పక్కనే మరో ఎకరం భూమి తీసుకుని పోటీగా వెంచర్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకోగా స్నేహితులు, కుటుంబ సభ్యులు సర్దిచెప్పారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చిట్టీల విషయంలో తరచూ అడ్డువస్తున్నాడని ఎలాగైనా తుదముట్టించాలని మహేష్ పథకం పన్నాడు. ఇందులోభాగంగా ఈనెల 23వ తేదీ రాత్రి జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదుట ఉన్న విజయ్‌కుమార్‌పై మహేష్, సోదరుడు చెన్నంగారి నరేష్కుమార్, అరుణ్‌కుమార్, రమేష్ కలిసి కత్తులతో దాడిచేసి చంపేసి పరారీ అయ్యారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది.
దీనిపై మృతుడి అన్న ఫిర్యాదు మేరకు హత్యతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరిపారు. చివరకు శనివారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమవేశంలో టూటౌన్ సీఐ డి.వి.పి.రాజు, భూత్పూర్ సీఐ గిరిబాబు పాల్గొన్నారు.