Vijay Pandit
-
విజయ్ హత్య వెనుక రాజకీయ హస్తం లేదు
దాద్రి (గ్రేటర్ నోయిడా): రెండు రోజుల కిందట దాద్రిలో జరిగిన బీజేపీ నాయకుడు విజయ్ పండిట్ హత్య వెనుక రాజకీయ హస్తం లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయ్ను కొందరు దుండగులు దాద్రిలోని మార్కెట్ వద్ద తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే తన భర్తను స్థానిక సమాజ్‌వాది పార్టీ నాయకుడు నరేంద్ర భాటీ హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ హత్య కేసులో భాటీ ప్రమేయం లేదని తమ దర్యాప్తులో తేలిందని యూపీ అదనపు డెరైక్టర్ జనరల్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. నిందితులను గుర్తించామని, వారు శిక్షణ పొందిన హంతకులని, వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదని తేలిందన్నారు. హత్య కేసును మరో మూడు, నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ‘పండిట్ హత్య కేసులో రాజకీయ హస్తం ఏదీ లేదు. గతంలో పలు బలవంతపు వసూళ్ల కేసుల్లో పండిట్‌కు సంబంధం ఉంది. ఆ సమయంలో అతడికి దాద్రిలోని మరో గ్రూప్‌తో విభేదాలు ఉండేవి. మేం కేసును రాజకీయ కోణంలోనూ శోధించాం.. అయితే ఆ దిశలో మాకు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు..’ అని చౌహాన్ వివరించారు. ‘రెండేళ్ల కిందట దాద్రిలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు నడుస్తుండేవని ఆయన చెప్పారు. అప్పటి ప్రత్యర్థి గ్రూపు సభ్యులే ఇప్పటి హత్య కేసులో నిందితులై ఉంటారని భావిస్తున్నాం. ఈ కేసు విషయమై మేం ఇప్పటివరకు సుమారు 30-40 మందిని విచారించాం. మరో మూడు రోజుల్లో కేసును తప్పక ఛేదిస్తామ’ని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ హత్యకు జైలు సహా పలు ప్రాంతాల్లో కుట్ర జరిగింది. హత్యాసమయంలో అతడిపై ఆరు,ఏడుగురు వ్యక్తులు దాడిచేసినట్లు మా దర్యాప్తులో తేలింది. దాద్రిలో వ్యాపారుల నుంచి చందాల వసూళ్లకు వ్యతిరేకంగా విజయ్ గతంలో ఆందోళనలు నిర్వహించాడు. అలాగే ఏప్రిల్ 2వ తేదీన అతడు పోలీసులకు సైతం ఫిర్యాదుచేశాడు. ఈ విషయంలో మరో గ్రూపు వారితో అతడికి వైరం ఏర్పడింది. కాగా, చందాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే బాగుండదని, వెంటనే ఆందోళనలు ఆపివేయాలని అతడికి ముజఫర్‌నగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అనిల్ డుజానా నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడని’ చౌహాన్ వివరించా. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే విజయ్‌పండిట్ హత్యకు గురయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, విజయ్ హత్యకు నిరసనగా సోమవారం దాద్రి, నోయిడా, గ్రేటర్ నోయిడాలలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావం నోయిడా నగరంలో తప్ప ఇంకెక్కడా ప్రభావం చూపలేదు. ఎన్‌హెచ్-91 మీద పలు చోట్ల బీజేపీ కార్యకర్తల రాస్తారోకోలతో వాహనాల రాకపోకలకు కొంతమేర అంతరాయమేర్పడింది. -
నోయిడా బంద్’ ప్రశాంతం
గ్రేటర్ నోయిడా: బీజేపీ పిలుపు మేరకు సోమవారం ‘నోయిడా బంద్’ విజయవంతమైంది. దాద్రినగర్ పంచాయతీ చైర్పర్సన్ భర్త, బీజేపీ నాయకుడు అయిన విజయ్ పండిట్‌ను కొందరు దుండగులు ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హత్య విషయం తెలుసుకున్న పండిట్ కుటుం బసభ్యులు, బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టిం చారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కాగా, విజయ్ హత్యకు నిరసనగా నోయిడా, గ్రేటర్ నోయిడా, దాద్రి ప్రాంతాల్లో ‘నోయిడా బంద్’కు పిలుపుని చ్చారు. దీంతో వ్యాపారసంస్థలు, పాఠశాలలు, పలు ప్రైవేట్ సంస్థలు మూతపడ్డాయి. సెక్టార్ 18 మార్కెట్, 19వ సెక్టార్‌లోని అటా మార్కెట్లలో బీజేపీ కార్యకర్తలు కవాతు నిర్వహిం చారు. కాగా, సెక్టార్ 18లో మార్కెట్‌ను వ్యాపారస్తులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసి ఉంచారని సెక్టార్ 18 ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్.కె.జైన్ తెలిపారు. గౌతమ్‌బుద్ధ్ నగర్ ఎంపీ మహేశ్ శర్మ మాట్లాడుతూ పోలీ సుల ఉదాసీనత వల్ల నేరాలు పెరిగిపోతుండటంతో నిరసనగా వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారని తెలిపారు. ఇదిలాఉండగా బాధిత కుటుంబసభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్‌పేయి సోమవారం పరామర్శించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, తన భర్త హత్య వెనుక స్థానిక ఎస్పీ నాయకుడు నరేందర్ భాటి హస్తముం దని హతుడి భార్య గీత ఆరోపించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పండిట్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
గ్రేటర్ నోయిడా: గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన బీజేపీ నేత విజయ్‌పండిట్ హత్య చుట్టూ రాజకీయ ఉచ్చు బిగిస్తోంది. విజయ్ పండిట్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అతడి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. హత్య వెనుక రాజకీయ హస్తం ఉందని, నిందితులను పట్టుకోవడంలో అధికారపార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితులెవరైనా ఉపేక్షించేది లేదని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చినా బీజేపీ నాయకులు శాంతించడంలేదు. బీజేపీ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్, దాద్రి నగర్ పంచాయతీ చైర్మన్ గీతా పండిట్ భర్త అయిన విజయ్ పండిట్(37) రాత్రి 8.30 గంటల సమయంలో బ్రహ్మపురిలో ఉన్న తన అన్న షాపు నుంచి తిరిగి వస్తుండగా రెండు బైక్‌ల మీద వచ్చిన దుండగులు దగ్గరనుంచి పండిట్‌పై కాల్పులు జరిపారు. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగులు అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే అందులో ఒక బైక్ అదుపు తప్పి పడిపోయింది. విషయం తెలిసి గుమిగూడిన స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో జీటీ రోడ్డులోని దాద్రి కోట్వలీ వద్ద హల్చల్ సృష్టించారు. కిందపడిన దుండగుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దాంతోపాటు మరిన్ని వాహనాలకు నిప్పంటించారు. అంతేకాక ఆ రోడ్డులో వచ్చిన బస్సులు, ఇతర వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి వరకు గొడవలు నడుస్తునే ఉన్నాయి. తర్వాత జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘దాద్రి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఎ.వి.రాజమౌళి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఏడీజీ (లా అండ్ ఆర్డర్) దేవేంద్ర చవాన్ మాట్లాడు తూ హంతకులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు సైతం హంతకుల కోసం గాలిస్తాయన్నారు. ఇదిలా ఉండగా, మృతుడు విజయ్ పండిట్ భార్య, దాద్రినగర్ పంచాయత్ చైర్మన్ గీత మాట్లాడుతూ తన భర్తను స్థానిక ఎస్పీ నాయకుడు నరీందర్ భాటి హత్య చేయించాడని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ తరఫున ప్రచారం చేయగా, నరీందర్ భాటీ నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. వాటి గురించి పోలీసులకు తెలిపినా ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. పండిట్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అతడి సోదరుడు లోకేష్ విమర్శించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం విజయ్‌పండిట్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం స్థానికులు, బీజేపీ కార్యకర్తలు భారీ ఊరేగింపు మధ్య పండిట్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు.