గ్రేటర్ నోయిడా: గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన బీజేపీ నేత విజయ్‌పండిట్ హత్య చుట్టూ రాజకీయ ఉచ్చు బిగిస్తోంది. విజయ్ పండిట్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అతడి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. హత్య వెనుక రాజకీయ హస్తం ఉందని, నిందితులను పట్టుకోవడంలో అధికారపార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితులెవరైనా ఉపేక్షించేది లేదని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చినా బీజేపీ నాయకులు శాంతించడంలేదు.
బీజేపీ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్, దాద్రి నగర్ పంచాయతీ చైర్మన్ గీతా పండిట్ భర్త అయిన విజయ్ పండిట్(37) రాత్రి 8.30 గంటల సమయంలో బ్రహ్మపురిలో ఉన్న తన అన్న షాపు నుంచి తిరిగి వస్తుండగా రెండు బైక్‌ల మీద వచ్చిన దుండగులు దగ్గరనుంచి పండిట్‌పై కాల్పులు జరిపారు. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దుండగులు అక్కడి నుంచి తప్పించుకుపోవడానికి గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే అందులో ఒక బైక్ అదుపు తప్పి పడిపోయింది. విషయం తెలిసి గుమిగూడిన స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో జీటీ రోడ్డులోని దాద్రి కోట్వలీ వద్ద హల్‌చల్ సృష్టించారు.
కిందపడిన దుండగుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దాంతోపాటు మరిన్ని వాహనాలకు నిప్పంటించారు. అంతేకాక ఆ రోడ్డులో వచ్చిన బస్సులు, ఇతర వాహనాలపై రాళ్లు రువ్వారు. రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి వరకు గొడవలు నడుస్తునే ఉన్నాయి. తర్వాత జాతీయ రహదారిపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘దాద్రి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఎ.వి.రాజమౌళి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు. ఏడీజీ (లా అండ్ ఆర్డర్) దేవేంద్ర చవాన్ మాట్లాడు తూ హంతకులను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాలు సైతం హంతకుల కోసం గాలిస్తాయన్నారు.
ఇదిలా ఉండగా, మృతుడు విజయ్ పండిట్ భార్య, దాద్రినగర్ పంచాయత్ చైర్మన్ గీత మాట్లాడుతూ తన భర్తను స్థానిక ఎస్పీ నాయకుడు నరీందర్ భాటి హత్య చేయించాడని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ తరఫున ప్రచారం చేయగా, నరీందర్ భాటీ నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. వాటి గురించి పోలీసులకు తెలిపినా ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. పండిట్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అతడి సోదరుడు లోకేష్ విమర్శించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం విజయ్‌పండిట్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం స్థానికులు, బీజేపీ కార్యకర్తలు భారీ ఊరేగింపు మధ్య పండిట్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు.
పండిట్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
Published Sun, Jun 8 2014 9:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement