దాద్రి (గ్రేటర్ నోయిడా): రెండు రోజుల కిందట దాద్రిలో జరిగిన బీజేపీ నాయకుడు విజయ్ పండిట్ హత్య వెనుక రాజకీయ హస్తం లేదని పోలీసులు స్పష్టం చేశారు. విజయ్‌ను కొందరు దుండగులు దాద్రిలోని మార్కెట్ వద్ద తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే తన భర్తను స్థానిక సమాజ్‌వాది పార్టీ నాయకుడు నరేంద్ర భాటీ హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ హత్య కేసులో భాటీ ప్రమేయం లేదని తమ దర్యాప్తులో తేలిందని యూపీ అదనపు డెరైక్టర్ జనరల్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. నిందితులను గుర్తించామని, వారు శిక్షణ పొందిన హంతకులని, వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదని తేలిందన్నారు. హత్య కేసును మరో మూడు, నాలుగు రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
‘పండిట్ హత్య కేసులో రాజకీయ హస్తం ఏదీ లేదు. గతంలో పలు బలవంతపు వసూళ్ల కేసుల్లో పండిట్‌కు సంబంధం ఉంది. ఆ సమయంలో అతడికి దాద్రిలోని మరో గ్రూప్‌తో విభేదాలు ఉండేవి. మేం కేసును రాజకీయ కోణంలోనూ శోధించాం.. అయితే ఆ దిశలో మాకు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు..’ అని చౌహాన్ వివరించారు. ‘రెండేళ్ల కిందట దాద్రిలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు నడుస్తుండేవని ఆయన చెప్పారు. అప్పటి ప్రత్యర్థి గ్రూపు సభ్యులే ఇప్పటి హత్య కేసులో నిందితులై ఉంటారని భావిస్తున్నాం. ఈ కేసు విషయమై మేం ఇప్పటివరకు సుమారు 30-40 మందిని విచారించాం. మరో మూడు రోజుల్లో కేసును తప్పక ఛేదిస్తామ’ని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈ హత్యకు జైలు సహా పలు ప్రాంతాల్లో కుట్ర జరిగింది. హత్యాసమయంలో అతడిపై ఆరు,ఏడుగురు వ్యక్తులు దాడిచేసినట్లు మా దర్యాప్తులో తేలింది. దాద్రిలో వ్యాపారుల నుంచి చందాల వసూళ్లకు వ్యతిరేకంగా విజయ్ గతంలో ఆందోళనలు నిర్వహించాడు. అలాగే ఏప్రిల్ 2వ తేదీన అతడు పోలీసులకు సైతం ఫిర్యాదుచేశాడు.
ఈ విషయంలో మరో గ్రూపు వారితో అతడికి వైరం ఏర్పడింది. కాగా, చందాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే బాగుండదని, వెంటనే ఆందోళనలు ఆపివేయాలని అతడికి ముజఫర్‌నగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అనిల్ డుజానా నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చాయని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడని’ చౌహాన్ వివరించా. అయితే దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే విజయ్‌పండిట్ హత్యకు గురయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, విజయ్ హత్యకు నిరసనగా సోమవారం దాద్రి, నోయిడా, గ్రేటర్ నోయిడాలలో బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రభావం నోయిడా నగరంలో తప్ప ఇంకెక్కడా ప్రభావం చూపలేదు. ఎన్‌హెచ్-91 మీద పలు చోట్ల బీజేపీ కార్యకర్తల రాస్తారోకోలతో వాహనాల రాకపోకలకు కొంతమేర అంతరాయమేర్పడింది.
విజయ్ హత్య వెనుక రాజకీయ హస్తం లేదు
Published Tue, Jun 10 2014 11:52 PM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement