తెల్లవారుజాము నుంచి రోడ్డుపైనే పడిగాపులు
విజయవాడ : ప్రయాణిలకు పట్ల ప్రయివేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ నుంచి నర్సాపురం వెళుతున్న విజయ మేఘన ట్రావెల్స్ బస్సు గతరాత్రి కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద బ్రేక్ డౌన్ అయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 30మంది ప్రయాణికులు తెల్లవారుజాము నుంచి రోడ్డుపైనే పడిగాపులు కాశారు.
మరో బస్సులో తమను తరలించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేసినా డ్రైవర్కానీ, ట్రావెల్స్ యాజమాన్యం కానీ స్పందించకపోవటంతో విసిగిపోయిన ప్రయాణికులు కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేసి, తమను గాలికి వదిలేసిన ట్రావెల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ దీపక్ ట్రావెల్స్ అనే మరో సంస్థ విజయవాడలో ప్రయాణికులకు నరకం చూపించిన విషయం తెలిసిందే. బస్సును అర్థరాత్రి కొన్నిగంటలపాటు నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.