మన వంటింట్లో మన వంట నూనె
సంక్షేమ హాస్టళ్లకు ‘విజయ’ పామాయిల్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ విభాగం ‘విజయ’ పామాయిల్‌ను మన వంటింట్లో మన వంట నూనె నినాదంతో ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తామని పేర్కొంది. అంతేకాక అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఈ బ్రాండ్ వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో విజయ నూనెలను మాత్రమే ఉపయోగించాలని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ రాజేశం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
అలాగే అన్ని రేషన్ దుకాణాల్లోనూ విజయ నూనెలను మాత్రమే విక్రయించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్లో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వంటనూనెలను సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం డబుల్ ఫిల్టర్ల వేరుశనగ, రిఫైన్డ్ సన్ ఫ్లవర్, ఆర్బీడీ పామాయిల్, నువ్వుల, రైస్‌బ్రాండ్, కొబ్బరి నూనెలు వివిధ పరిమాణాల్లో విక్రయిస్తున్నామన్నారు.