కాదంటే తంతాం
ప్రభుత్వం మాది.. మేం చెప్పినట్లే మీరు వినాలి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. కాదు.. గీదు అంటే కుదర్దు. మీతో ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు. అవసరమైతే తన్నైనా సరే మీతో పనులు చేయించుకుంటామంటూ ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్ భర్త(శానిటరీ మేస్ట్రీ) బెదిరించారు. వారి మొహాన పేపర్లు విసిరికొట్టారని విశ్వసనీయ సమాచారం. దీంతో మనస్తాపం చెందిన సదరు అధికారులు సెలవులో వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.
ప్రొద్దుటూరు టౌన్
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో డీఈలు గా పని చేస్తున్న రమణ, విజయకుమార్‌రెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సహా అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ భర్త(శానిటరీ మేస్త్రీ) సోమవారం రాత్రి బిల్లల మంజూరుకు సంబంధించిన కాగితాలను చేతబట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వాటి చూపిస్తూ పాస్ చేయాలని డీఈలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రికార్డులు లేనిదే బిల్లులు చేయడానికి సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి చాంబర్లో ఉండగానే డీఈలు ఇద్దరినీ అక్కడికి పిలిపించారు. చైర్మన్ సమక్షంలో బిల్లులు చేయాలని కోరగా.. డీఈలు నిరాకరించారు. దీంతో అసహనంతో చైర్మన్ ఎదుటే డీఈలపై వారు రెచ్చిపోయారు. చెప్పినట్లు సంతకాలు పెట్టకపోతే తంతామంటూ దాదాగిరి చేశారు. బిల్లులను తీసుకుని వారి మొహాలపై విసిరికొట్టారు. ఊహించని ఈ పరిణామంతో డీఈలు ఇద్దరూ అవాక్కయ్యారు.
మనస్తాపంతో సెలవులో వెళ్లిన డీఈలు
టీడీపీ కౌన్సిలర్ల నోటి దురుసుతో తీవ్ర మనస్తాపం చెందిన డీఈలు ‘ఇక మేం పని చేయలేమంటూ’ మున్సిపల్ కమిషనర్‌కు విషయం చెప్పి మెడికల్ సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో రెండు సిమ్‌కార్డులను కార్యాలయంలోని ఓ అధికారికి అప్పగించి మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయారు.