బాహుబలి-2 థియేటర్లపై సెన్సార్ బోర్డు దాడులు
హైదరాబాద్: ఇప్పటికే బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కొన్ని థియేటర్లలో నిబంధలనకు విరుద్ధంగా గురువారం మూవీ ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు కొందరు ఎల్బీనగర్ లోని విజయలక్ష్మి థియేటర్‌పై దాడులు నిర్వహించారు. నిబంధనలను విరుద్ధంగా బాహుబలి-2 ప్రదర్శిస్తున్నారని బోర్డు అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో థియేటర్ యాజమాన్యానికి, సెన్సార్ బోర్డు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. సెన్సార్ బోర్డు సభ్యులు మరికొన్ని థియేటర్లపైనా దృష్టిపెట్టారు.
బోర్డు సభ్యులపై విజయలక్ష్మి థియేటర్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. మరోవైపు విజయలక్ష్మి థియేటర్ కాంప్లెక్స్ వద్ద బీజేవైఎం ఆందోళన చేపట్టింది. బాహుబలి-2 ప్రీ రిలీజ్ షో నిలిపి వేయాలంటూ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. థియేటర్ వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్న విషయం తెలిసిందే.