దేవుడికే శఠగోపం..!
రామవరప్పాడు (గన్నవరం): దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మేడేపల్లి విజయరామరాజు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు సంపాదించాడన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. నిడమానూరులోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ ప్లాట్ నంబర్ 101లో బుధవారం ఉదయం ఈ దాడులు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించిన సోదాల్లో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయరామరాజుకు చెందిన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. నిడమానూరులోని అతని ప్లాట్‌లో ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో సుమారు 10 మంది బృందం సోదాలు చేపట్టారు.
ఇందులో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, భవనాలు, ఇళ్లు, నగదు, బంగారం, వెండి, వాహనాలు, విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విజయరామరాజు దేవాలయాల భూములకు సంబంధించిన శాఖ లీగల్ సెల్లో పనిచేస్తున్నాడు. దీంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు వివాదంలో ఉన్నాయో చూసి వాటిని దొడ్డి దారిన తన వశం చేసుకునేవాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని కోట్లు విలువజేసే దేవుడి భూములను అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేవాడు.
♦ హైదరాబాద్‌లోని గడ్డి అన్నారంలో 100 గజాల స్థలం, కృష్ణాజిల్లాలోని పోతేపల్లి వద్ద 201 గజాల స్థలంతో పాటు భీమడోలు జంక్షన్ వద్ద ద్వారకానగర్‌లో గెస్ట్‌హౌస్, నిడమానూరులోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ ట్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ 1, 2004–2005 నిర్మించిన జీప్లస్–1 గృహం విజయరామరాజు పేరు మీదే ఉన్నాయి.
♦ బార్య లిల్లీగ్రేస్ పేరున పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు దగ్గర జి.కొత్తపల్లిలో ఎకరం భూమి, అదే భీమడోలులో 200 గజాల ఓపెన్ ప్లాట్, కృష్ణాజిల్లా కేసరపల్లిలో 196 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్నాయి.
♦ పెద్ద కొడుకు మేడేపల్లి ప్రదీప్ విజయ్ పేరున భీమవరం వద్ద గునుపూడి వద్ద 195.5 గజాల ఓపెన్ ప్లాట్, గుంటూరు రామచంద్రపురం అగ్రహరంలో 200 గజాల స్థలం గుర్తించారు.
♦ రెండో కొడుకు మేడేపల్లి సందీప్ పేరు మీద పశ్చిమగోదావరి జిల్లా జగన్నాథపురంలో 1.57 ఏకరాల భూమి, విజయ్‌రామరాజు తండ్రి ఫ్రాన్సిస్ పేరున పశ్చిమగోదావరి జిల్లా వట్లూరి గ్రామంలో ఒకే వెంచర్లో రెండు 200 గజాల ఒపెన్ ప్లాట్లు గుర్తించారు. సోదరి గంజి విజయకుమారి పేరున భీమడోలు వద్ద 200 గజాల స్థలం, భీమడోలు వద్ద ఒకే వెంచర్లో 200 గజాలు, 212 గజాలు ఇళ్ల స్థలాలను గుర్తించారు. రూ.2.12 లక్షలు, రూ.5 లక్షల బ్యాంక్ బాలెన్స్, 16 లక్షల విలువైన వస్తువులు, 519 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 570 చీరలు (వాటిలో పట్టు చీరలు 100), మూడు ఖరీదైన కార్లు, 4 ద్విచక్ర వాహనాలు గుర్తించారు.