టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నామినేషన్
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్(నాని) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కెనాల్ రోడ్డులోని వినాయకుడు గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు స్థానికేతరులు ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నికయ్యారని, అందువల్ల వారికి స్థానిక సమస్యలపై పూర్తి అవగాహనలేదని చెప్పారు. తాను ఇక్కడి వాడినికావడంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
తాను గెలిస్తే విజయవాడ నగర అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని, ముఖ్యంగా పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. తాను ఏసామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, అన్ని సామాజికవర్గాలను కలుపుకుని వెళతానని తెలిపారు.
కేశినేనిని పార్లమెంట్ గేటు తాకనివ్వమంటూ కొంతమంది నేతలు చేస్తున్న హడావుడి పై ప్రశ్నించగా, అది నిర్ణయించాల్సింది ప్రజలు అని, వారు కాదని, తన గెలుపుపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ర్యాలీలో అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.