ఒత్తిడి చేసి కమిషనర్‌తో చెప్పించారు
– నిజాయితీ అధికారిగా పేరున్న బాలసుబ్రహ్మణ్యం నిజాలు బయటకు చెప్పాలి
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం : తనపై దాడికి దిగిన అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే విషయంలో ‘సమస్య సద్దుమణిగిందంటూ’ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం చెప్పడం వెనుక ప్రభుత్వ ఒత్తిడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కమిషనర్ బాలసుబ్రమణ్యంకు నిజాయితీ అధికారిగా పేరుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారని, ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. అలాంటి వ్యక్తిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా తాము ప్రజాప్రతినిధులమని కూడా మరచి దూషణలకు, దాడికి దిగారని గుర్తు చేశారు. తాను నోరు తెరిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని కమిషనర్ అనడంతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు ప్రభుత్వం ఎంపీ, ఎమ్మెల్యేలతో ఆయనకు క్షమాపణ చెప్పించిందని పేర్కొన్నారు.
‘ప్రభుత్వ ఒత్తిడితోనే సమస్య సద్దుమణిగిందంటూ కమిషనర్ చెప్పారు. నిజాయితీ అధికారిగా పేరున్న ఆయన వాస్తవాలు బయటకు చెబుతారని అందరూ భావించారు. అయితే వాస్తవాలను ఆయన దాస్తుండటంతో నిజాయితీని శంకించాల్సి వస్తోంది. అసలు బస్సుల మాఫియా ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో ఇద్దరు,ముగ్గురు కలిసి ఈ మాఫియాను నడుపుతున్నారు. ఈ మాఫియా గురించి గతంలోనే తాము చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోగా తేలిగ్గా తీసుకుంద’ని విమర్శించారు. కేశినేని నాని బస్సు ఆపరేటర్ కాబట్టి కమిషనర్ వద్దకు వెళ్లారని, అదే సమయంలో బొండా ఉమా ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ బరి తెగింపునకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.