జైశా ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి
రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైశా తాను ఎదుర్కొన్న పరిస్థితులపై చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు. మారథాన్ రన్నర్ ఓపీ జైశా ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విచారణ అధికారులకు గోయల్ సూచించారు.
ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చినా అథ్లెట్లు తీసుకోలేదని అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) చేసిన ప్రకటనలో వాస్తవం లేదని మారథాన్ రన్నర్ ఓపీ జైశా పేర్కొంది. రియోలో 42 కిలోమీటర్ల మారథాన్ పోటీలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన తనకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని జైశా ఆరోపించింది. 'నిజమేంటో ఏఎఫ్ఐ ప్రతినిధులకు తెలుసు. నేను పోటీలో పాల్గొన్న చోట కెమెరాలు ఉన్నాయి. వీడియో ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవం వెల్లడవుతుంది. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు' అని జైశా స్పష్టం చేసిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర మంత్రి విచారణకు ఆదేశించారు.